మహిళా, శిశు సంక్షేమానికి అంతంతే .. ఆ శాఖకు రూ. 26,092 కోట్లు కేటాయింపు

  • నిరుడితో పోలిస్తే​ 2.5 శాతం మాత్రమే పెంపు
  • ఆ శాఖకు రూ. 26,092 కోట్లు కేటాయింపు
  • మహిళల వర్క్​ఫోర్స్​ను పెంచేందుకు వర్కింగ్​ విమెన్ హాస్టల్స్​ ఏర్పాటు

న్యూఢిల్లీ: బడ్జెట్​లో కేంద్ర సర్కారు మహిళా, శిశు సంక్షేమానికి అంతంత మాత్రమే కేటాయింపులు చేసింది. నిరుడితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్​ను 2.5శాతం మాత్రమే పెంచింది. తాజా బడ్జెట్​లో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు రూ. 26,092 కోట్లు కేటాయించింది. నిరుడు ఈ శాఖకు రూ. 25,448 కోట్ల కేటాయింపు చేశారు.

కాగా, మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించేందుకు వివిధ మంత్రిత్వ శాఖల్లో మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం బడ్జెట్​లో రూ. 3లక్షల కోట్లకు పైగా కేటాయింపులు చేసినట్టు నిర్మలా సీతారామన్​ తెలిపారు. మహిళల వర్క్​ఫోర్స్​ను పెంచేందుకు వర్కింగ్​ విమెన్​హాస్టల్స్​ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ చర్యలు ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్రను పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తాయని పేర్కొన్నారు. 

కేటాయింపులు ఇలా..

  • విమెన్​ హాస్టల్స్, స్వధార్​ గృహాలు, ప్రధాన మంత్రి మాతృ వందన యోజనలాంటి ప్రాజెక్టుల కోసం ఉద్దేశించిన సబ్​ స్కీమ్​ ‘సామర్థ్య’ కోసం రూ. 2,516 కోట్ల కేటాయింపులు చేశారు. 
  • చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడంతో పాటు బాలల సంరక్షణకు ఉద్దేశించిన ‘సాక్షమ్​ అంగన్​వాడీ’, ‘పోషణ్​ 2.0’ స్కీమ్స్​ కోసం రూ. 21,200 కోట్లు కేటాయించారు. 
  • శిశు సంరక్షణ సేవలు, సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘వాత్సల్య మిషన్’​కు రూ. 1,472 కోట్ల కేటాయింపులు చేశారు.
  • మహిళల భద్రత కోసం ఉద్దేశించిన వన్​స్టాప్​ సెంటర్స్​, బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమాలతో కూడిన ‘సంబాల్​’ సబ్​స్కీమ్ ​కోసం రూ. 629 కోట్లు కేటాయించారు. 
  • శిశు అభివృద్ధిలో పరిశోధన,శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎన్ఐపీసీసీడీకి రూ. 88.87 కోట్లు, చైల్డ్​ అడాప్షన్స్​కు బాధ్యత వహించే సీఏఆర్​ఏకు రూ. 11.40 కోట్ల కేటాయింపులు చేశారు. 
  • యునిసెఫ్​కు దేశ సహకారంగా రూ. 5.60 కోట్లు, నిర్భయ ఫండ్​కోసం రూ.500 కోట్లు కేటాయించారు.