ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రైతుల నుంచి కొన్న  ధాన్యానికి ఆలస్యం కాకుండా  చెల్లింపులు  చేయాలని  రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డితో కలిసి  ధాన్యం సేకరణపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వంద శాతం వడ్లను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు.

వనపర్తి ,గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎక్కువగా ఉందన్నారు.  శనివారంలోపు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి అన్ని జిల్లాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి  చెల్లింపులు చేయాలని సూచించారు. జనవరి నుంచి  రేషన్ కార్డులపై  సన్నబియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 36 లక్షల మెట్రిక్ టన్నులు సన్నవడ్లను సేకరించాలని టార్గెట్​ పెట్టుకున్నట్టు చెప్పారు. 

ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాలో ఇప్పటివరకు 18, 383 మంది రైతుల నుంచి సన్న,   దొడ్డు రకాలు కలిపి రూ. 333 కోట్ల  విలువైన 1,26,154 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని  కొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఇప్పటికే  రూ.  216.78 కోట్ల చెల్లింపులు జరిగాయని, ఇందులో రూ.  8.75 కోట్లు  సన్న వడ్లకు  బోనస్ గా చెల్లించినట్లు పేర్కొన్నారు.  

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ధాన్యం సేకరణ అన్నిజిల్లాల కన్నా బాగుందన్నారు.  రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యేలు  యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి,   జి. మధుసూదన్ రెడ్డి,  కసిరెడ్డి నారాయణరెడ్డి,  మేఘా రెడ్డి,  పర్ణికా రెడ్డి,  అనిరుధ్​రెడ్డి , వీర్లపల్లి శంకర్, వంశీకృష్ణ, డీసీసీబీ  చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.