దేశ రాజకీయాల్లో కాకా లెజెండ్ : ఉత్తమ్

  • ఆయన చేపట్టని పదవి లేదు: ఉత్తమ్ 
  • కాకా ఫ్యామిలీలో మూడో తరం కూడా రాజకీయాల్లో రాణిస్తున్నది 
  • అంబేద్కర్ విద్యాసంస్థల సేవలు అభినందనీయం  
  • కాకా వర్ధంతి సభ, అంబేద్కర్ విద్యాసంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి  

హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశ రాజకీయాల్లో కాకా వెంకటస్వామి ఒక లెజెండ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ‘‘కాకా చేపట్టని పదవి లేదు. రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, సీడబ్ల్యూసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా విశిష్ట సేవలు అందించిన ఆయన.. ఎప్పటికీ ఒక లెజెండ్ గా మిగిలిపోతారు. అలాంటి మహానేత వారసత్వంగా వివేక్, వినోద్ రాజకీయాల్లో రాణిస్తున్నారు. అంతేకాకుండా కాకా ఫ్యామిలీలో మూడో తరం నుంచి వంశీకృష్ణ కూడా రాజకీయాల్లో రాణించడం అభినందనీయం” అని అన్నారు. 

ఆదివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో కాకా పదో వర్ధంతి సభ, అంబేద్కర్ విద్యాసంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉత్తమ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లాభాపేక్ష లేకుండా ఐదు దశాబ్దాలుగా అంబేద్కర్ విద్యాసంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆయన అన్నారు.

 80 శాతం మెరిట్ ఉన్న విద్యార్థులకు ఉచిత విద్య అందించడం మంచి విషయం. విద్యను వ్యాపారంగా మార్చుకున్న ఈ రోజుల్లో ఎలాంటి డొనేషన్లు సేకరించకుండా పేద విద్యార్థులను దృష్టిలో పెట్టికొని విద్యను అందించడం అభినందనీయం” అని అన్నారు. అంబేద్కర్ విద్యాసంస్థలు విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి శంకర్రావు పాల్గొన్నారు. 

ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నదే కాకా కోరిక: సరోజా వివేక్​

ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నదే కాకా కోరిక అని అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్ చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే ఆయన విద్యాసంస్థలు ఏర్పాటు చేశారని తెలిపారు. ‘‘కాకా చదువు విలువ తెలిసిన వ్యక్తి. ఆర్థిక స్థోమత లేని వారి కోసం ఆయన విద్యాసంస్థలు పెట్టారు. అంబేద్కర్ కాలేజీలో చదివినోళ్లు ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కాలేజీలో ఒక్క పైసా డొనేషన్ తీసుకోవడం లేదు. 80% మార్కులు సాధించిన వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. పేద విద్యార్థి చదువు కోసం అంబేద్కర్​ కాలేజీ గేట్లు తెరిచే ఉంటాయి” అని చెప్పారు. 

అంబేద్కర్ సూచనతోనే విద్యాసంస్థలు ప్రారంభం: వినోద్  

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచనతోనే అంబేద్కర్ విద్యాసంస్థలను కాకా వెంకటస్వామి నెలకొల్పారని ఆ సంస్థల సెక్రటరీ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. ‘‘అంబేద్కర్ 1954లో సికింద్రాబాద్ వచ్చినప్పుడు మా తండ్రి కాకా వెంకటస్వామి  ఆయనను కలిశారు. బడుగు బలహీన వర్గాల కోసం తానేం చేయాలో చెప్పాలంటూ అంబేద్కర్ ను కాకా అడిగారు. దానికి ఒక విద్యాసంస్థను ప్రారంభించి బడుగు బలహీన వర్గాలకు మంచి విద్య అందించాలని అంబేద్కర్ సూచించారు. దీంతో 1974లో బాగ్ లింగంపల్లిలో అంబేద్కర్ విద్యాసంస్థలను కాకా స్థాపించారు” అని వివరించారు. అంబేద్కర్ కాలేజీకి న్యాక్ గుర్తింపు రావడం అభినందనీయమన్నారు. 

2 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అయ్యారు: వంశీకృష్ణ 

అంబేద్కర్ స్ఫూర్తితో కాకా రాజకీయాల్లోకి వచ్చారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కాకా తపించేవారని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా కాకా వెనక్కి తగ్గలేదని, ఆయన పోరాటంతోనే నిరుపేదలకు ఇండ్లు వచ్చాయన్నారు. 

అంబేద్కర్ కాలేజీ నుంచి 2 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అయ్యారని వెల్లడించారు. కాకా స్ఫూర్తితో 50 ఏండ్లుగా కాలేజీ నడుస్తోందన్నారు. ‘‘రాజ్యాంగ రక్షణకు కాకా కృషి చేశారు. అంబేద్కర్​పై అమిత్​షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం” అని అన్నారు. 

కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: కేఆర్ నాగరాజు

కాకా ఎంతో మందికి సాయం చేశారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​నాగరాజు అన్నారు. కాకా సాయం పొందిన వారిలో తానూ ఒక్కడినని చెప్పారు. కాకా గొప్ప ఆశయాలు కలిగిన వ్యక్తి అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. 

అంబేద్కర్ కాలేజీకి  త్వరలో అటానమస్ హోదా: వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్ కాలేజీకి జాతీయ స్థాయిలో న్యాక్–ఏ గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అన్నారు. ‘‘కార్పొరేట్ కాలేజీలకు దీటుగా అంబేద్కర్ కాలేజీ ఏర్పాటు చేశాం. ఇక్కడ డొనేషన్ ఉండదు. బాగా చదివే విద్యార్థులకు ఫీజులో రాయితీ కూడా ఉంటుంది. ఇండియా టుడే చేసిన సర్వేలో టాప్​25 కాలేజీల్లో అంబేద్కర్​కాలేజీ ఉంది. మా కాలేజీలో చదువుకున్నోళ్లు జడ్జీలు కూడా అయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కోర్సు కూడా ప్రవేశపెడతాం. త్వరలో అంబేద్కర్ కాలేజీకి అటానమస్ హోదా రానుంది. కాకా స్ఫూర్తితోనే తెలంగాణ కోసం కోట్లాడాం. కాకా చనిపోయి పదేండ్లు అయినప్పటికీ, నేను ఎక్కడికి వెళ్లినా.. కాకా కుమారుడిగా ఎనలేని గౌరవాన్ని పొందుతున్నాను” అని వివేక్​​ చెప్పారు.

కాకా అందరికీ ఆదర్శం:  మంత్రి పొన్నం  

కాకా వెంకటస్వామి అందరికీ ఆదర్శమని మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. ‘‘రాజకీయాల్లో ప్రతి పదవిని చేపట్టిన వ్యక్తి కాకా. ఆయన సేవలను గుర్తుచేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ కోసం కాకా చేసిన పోరాటం మరువలేనిది. ఆయనను ఆదర్శంగా తీసుకొనే మేం కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాం.  రాజకీయంగా, చదువు పరంగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చేలా కృషి చేసిన వ్యక్తి కాకా. విద్యార్థులందరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి” అని పిలుపునిచ్చారు. 

ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు 

అంబేద్కర్ విద్యాసంస్థలు స్థాపించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్టూడెంట్లు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫ్యాకల్టీకి, స్టూడెంట్లకు వివేక్​వెంకటస్వామి, సరోజా వివేక్ అవార్డులు అందజేశారు. కాకా జీవిత చరిత్రపై విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ అందరినీ ఆకట్టుకుంది. కాలేజీలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను స్పీకర్​గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తిలకించారు.