పరిగి, వెలుగు : పామాయిల్‌ను సాగు చేస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుందని అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా భూమన్నగారి పరశురాంరెడ్డి, వైస్‌చైర్మన్‌గా అయూబ్, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బీఎస్.ఆంజనేయులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ధనసరి సీతక్క, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మె్ల్యే ప్రతీక్‌జైన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తే కలెక్టర్ జీతం కంటే ఎక్కువ సంపాదించొచ్చని చెప్పారు. ప్రతి రైతుకు పంట బీమా అందజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలందరికీ సన్నబియ్యం అందజేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇస్తోందని చెప్పారు. పరిగిలో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి తుమ్మల తెలిపారు.
అనంతరం పరిగి మున్సిపల్ బిల్డింగ్, పరిగి- - లక్నాపూర్ బీటీ రోడ్డు, బంజారా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ట్రిపుల్ ఆర్ పూర్తయితే జిల్లాలోని భూముల రేట్లు భారీ స్థాయిలో పెరుగుతాయన్నారు. రైతులకు పురుగుల మందు పిచికారి చేసేందుకు డ్రోన్ అందజేసేందుకు కృషి చేస్తుందన్నారు. రైతులు ఆయిల్ సాగు చేస్తే కలెక్టర్ వేతనం కంటే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చన్నారు. అంతకుముందు కుల్కచర్లలోని పాంబండ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మంత్రులు తుమ్మల, సీతక్క ప్రత్యేక పూజలు చేశారు.