ఆర్టీసీని లాభాల బాట పట్టించాం

  • ఇప్పటివరకు ఆర్టీసీలో116 కోట్ల మంది మహిళలు పయనం 
  • రూ.5 కోట్లతో హుజూర్ నగర్ కొత్త బస్టాండ్ పునరుద్ధరణ 
  • మంత్రి పొన్నం ప్రభాకర్  
  • సమగ్ర అభివృద్ధే లక్ష్యం
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ/హుజూర్ నగర్/మిర్యాలగూడ, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో మూసేస్తామన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ మండలం బాదలాపురం గ్రామంలోని సూర్యతేజ రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిల్లులో రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన సైలోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం హుజూర్ నగర్, కోదాడలో బస్టాండ్లను వారు పరిశీలించారు. 

హుజూర్ నగర్​లో రూ.8 కోట్లతో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, రూ.2 కోట్లతో గోవిందపురం బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కోదాడ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి మంత్రులు ఉత్తమ్ కుమార్​రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి  పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. 

ఇప్పటివరకు ఆర్టీసీలో116 కోట్ల మంది మహిళలు ప్రయాణించారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజూ 60 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఇందులో 34 లక్షల మంది మహిళలను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 ఆర్టీసీ డిపోలు ఉన్నాయని, 640 బస్సులను ప్రయాణికుల సౌకర్యం కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. హుజూర్ నగర్ కొత్త బస్టాండ్ ను 40 ఏండ్ల క్రితం నిర్మించారని, రూ.5 కోట్లతో పునరుద్ధరిస్తామన్నారు. 

సమగ్ర అభివృద్ధే లక్ష్యం..

హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణంలోని వంద పడకల ఆస్పత్రిలో అదనపు గదులు, సిటీ స్కాన్, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల ఆధునీకరణ పనులు, లిఫ్ట్ ల మరమ్మతు పనులు చేపట్టామన్నారు. మైనార్టీల కోసం షాదీఖానాలు, రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు, విద్య, వైద్యంతోపాటు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. పట్టణ శివారులోని  రామస్వామిగుట్ట వద్ద 112 ఎకరాల స్థలంలో పేదల కోసం రెండు వేలపైగా ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. 

 రూ.300 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లిష్ మీడియం స్కూల్ ను చిలుకూరులో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ స్కూల్​లో 2500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తారని పేర్కొన్నారు. విద్యారంగంలో తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధిస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్ పర్సన్ అర్చనారవి, ఆర్డీవో శ్రీనివాసులు, వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.