పంటలు ధ్వంసం చేయొద్దు : మంత్రి కొండా సురేఖ

  • ఫారెస్ట్, రెవెన్యూ భూ సమస్యలు పరిష్కరించాలి
  • అర్హులైన రైతులందరికీ పట్టాలివ్వాలి 
  • అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

మెదక్​, వెలుగు : పొజిషన్ లో ఉండి భూములు దున్నుకునే రైతులను ఇబ్బందులు పెట్టొద్దని, సాగు చేసుకునే పంటలు ధ్వంసం చేయొద్దని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫారెస్ట్​ఆఫీసర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్​లో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. చేగుంట  మండలం ఇబ్రహీంపూర్, రుక్మాపూర్, మాసాయిపేట మండలం నడిమి తండాలో 40 , 50 ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న రైతులను ఫారెస్ట్​ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇబ్రహీంపూర్​లో ఒక సర్వే నెంబర్​లో  పట్టాలిచ్చి, మరో సర్వే నెంబర్​లో  ఇవ్వలేదన్నారు.

ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ..  మండలానికి రెండు గ్రామాల్లో మాత్రమే పోడు భూములకు పట్టాలిచ్చారని, ఇతర గ్రామాల పోడు రైతులకు పట్టాలు రాక రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల బెనిఫిట్స్​అందడం లేదని, పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేకపోతున్నారన్నారు. కౌడిపల్లి మండలం దేవులపల్లిలో ఓ గిరిజన రైతు సాగు చేస్తున్న పంటలు ధ్వంసం చేసి అతడి వెహికల్స్​సీజ్​ చేశారన్నారు. శివ్వంపేట మండలం నవాపేటలో గిరిజనులు అనేక ఏళ్లుగా ఫారెస్ట్​ను ఆనుకుని ఇండ్లు కట్టుకుని నివసిస్తుండగా ఖాళీ చేయాలంటున్నారని తెలిపారు.

ఎమ్మెల్సీ శేరిసుభాష్​ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నశంకరంపేట మండలంలో 70 ‌‌ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటున్న  రైతులను ఫారెస్ట్​ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారన్నారు. కొన్నిచోట్ల గ్రామం మొత్తం ఫారెస్ట్​లోనే ఉందంటున్నారని తెలిపారు. వీటిపై స్పందించిన మంత్రి ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్లు జాయింట్​ సర్వే చేసి భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్, డీఎఫ్​వోలకు సూచించారు.  ప్రభుత్వం తరపున ఏవైనా పర్మిషన్ కావాలంటే ఇస్తామన్నారు. నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు పట్టాలు అందేలా చూడాలన్నారు.

వన మహోత్సవంలో నాటిన మొక్కలు, ఎవెన్యూ ప్లాంటేషన్, ఫారెస్ట్​భూములకు సంబంధించిన కేసుల​గురించి సరైన సమాచారం లేకుండా రావడంతో డీఎఫ్​వో జోజిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  జిల్లాలో కోట్ల విలువైన గన్నీ బ్యాగుల గోల్​మాల్​జరిగితే ఔట్​ సోర్సింగ్​ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకోవడాన్ని ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి తప్పుబట్టారు.  ధాన్యం కొనుగోలు సందర్భంగా తరుగు పేరుతో  మిల్లర్లు రైతులకు నష్టం కలిగిస్తున్నారని, ఈ విషయం ఎన్నిసార్లు సివిల్​సప్లై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆరోపించారు. ఫిర్యాదు చేసినా మిల్లర్లపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ  రైస్​ మిల్లర్లకు కొమ్ము కాయొద్దని రైతులకు ఇబ్బందులు లేకుండా, నష్టం కలగకుండా చూడాలని సివిల్​సప్లై అధికారులను ఆదేశించారు. 


రామాయంపేట మండలం కోనాపూర్, చేగుంట మండలం ఇబ్రహీంపూర్​, రెడ్డిపల్లి సొసైటీల్లో కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగినా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎంపీ రఘునందన్ రావు డీసీవో కరుణను ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన వారు కోర్టుకు వెళ్లేందుకు చాన్స్​ ఎందుకు ఇస్తున్నారని, డిపార్ట్​మెంట్​తరపున కేవియట్​ఎందుకు వేయడం లేదన్నారు. ఈ అంశంపై కలెక్టర్​రాహుల్​రాజ్​ స్పందిస్తూ.. సొసైటీల్లో ఆడిట్​ప్రాపర్​గా జరగడం లేదన్నారు. దీనివల్ల అక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.  ప్రైవేట్​స్కూల్స్​ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేయకుండా నియంత్రించాలని మంత్రి సురేఖ డీఈవో రాధాకిషన్​ ను ఆదేశించారు.

కౌడిపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రారంభిస్తే తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రోడ్లు, అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీ రఘునందన్ రావు ఆర్​అండ్ బీ ఈఈ సర్దార్​ సింగ్​ను ఆదేశించారు. ప్రైవేట్​ హాస్పిటల్స్​ అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, నిబంధనలు పాటిస్తున్నాయా లేదా చెక్​ చేయాలని డీఎంహెచ్​వో శ్రీరామ్​ను మంత్రి ఆదేశించారు. ఏడుపాయల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రోహిత్​రావు మంత్రిని కోరారు. సమావేశానికి ముందు మంత్రి సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రోహిత్​ రావు కలెక్టరేట్​ ప్రాంగణంలో మొక్కలు నాటారు. చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించారు.