ఇథనాల్​ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలి

  • సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సైదులు

మోతె (మునగాల), వెలుగు : ఎన్ఎంకే  ఇథనాల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు అయ్యేంతవరకూ ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు అన్నారు. సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకొని దీక్షను భగ్నం చేశారు. 

ఈ సందర్భంలో పోలీసులకు ఆందోళనకాలకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ రావిపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీ పనులు పూర్తయితే చుట్టుపక్కన గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రజల ఆరోగ్యంపై కాలుష్యం ప్రభావం చూపుతుందన్నారు. దీంతో శ్వాసకోశ, చర్మవ్యాధులతోపాటు గుండె, మెదడు, కిడ్నీ, లివర్ తదితర వ్యాధులకు ప్రజలు గురయ్యే అవకాశం ఉందన్నారు.

దీని మూలంగా భవిష్యత్​లో చుట్టూ 20 కిలో మీటర్ల మేర మనుషులు బతికే పరిస్థితి ఉండదన్నారు. విషయమై తక్షణమే ప్రభుత్వం, కలెక్టర్ జోక్యం చేసుకొని ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.