యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్..2004లో అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టిన మన్మోహన్

మన్మోహన్ సింగ్ అనుకోకుండా ప్రధాని అయ్యారు. అందుకే ఆయనను ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అంటారు. 2004లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ నేతృత్వంలోని ఎన్డీయేనే మళ్లీ గెలుస్తుందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేశారు. ఎన్డీయేనే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రీజినల్ పార్టీల మద్దతుతో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే అప్పుడు ఎవరు ప్రధాని అవుతారనే దానిపై విస్తృతంగా చర్చ జరిగింది.

సోనియాగాంధీ ఇటలీ సిటిజన్ అని ఆమె రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో దీన్ని మరోసారి తెరపైకి తెచ్చిన బీజేపీ నేతలు.. సోనియా ప్రధాని అయితే ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. సొంత పార్టీలోనూ సోనియాకు వ్యతిరేకత ఎదురైంది. మరోవైపు ప్రధాని పదవి చేపట్టవద్దని సోనియాను రాహుల్ గాంధీ కోరినట్టు కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ తన ఆటోబయోగ్రఫీ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనాఫ్’లో పేర్కొన్నారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రధాని పదవిలో ఉండగా హత్యకు గురైన నేపథ్యంలో ఆ పదవి చేపట్టవద్దని రాహుల్ ఆందోళన చెందినట్టు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానిగా సోనియా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై విస్తృతంగా చర్చ జరిగింది.

ప్రధాని కాబోయేది వీళ్లేనంటూ ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కానీ సోనియా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, అనూహ్యంగా మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా ఎంపిక చేశారు. 2004 మే 22న భారతదేశ 14వ ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత యూపీఏ 2 సర్కార్ లోనూ ఆయనే దేశాన్ని నడిపించారు. మొత్తం పదేండ్ల పాటు ప్రధానిగా సేవలందించారు. కాగా, ప్రధానిగా మన్మోహన్ పదవీకాలంపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే మూవీని హిందీలో తీశారు. ఇందులో మన్మోహన్ గా అనుపమ్ ఖేర్ నటించారు.