వానాకాలం వడ్ల మిల్లింగ్ ఎట్ల?

  • జిల్లాలోని 54 రైస్ మిల్లుల్లో 39 డీఫాల్ట్ 
  • వీటికి వడ్లు ఇవ్వకూడదని సర్కారు ఆదేశాలు 
  • ఈ సీజన్​లో 2 లక్షల టన్నుల సేకరణ 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్​వడ్ల మిల్లింగ్ కష్టతరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 19 బాయిల్డ్, 35 రా కలిపి మొత్తం 54 రైస్​మిల్లులు ఉండగా.. వీటిలో ఇప్పటివరకు 39 మిల్లులు డీఫాల్ట్​లిస్ట్​లో చేరాయి. 

ఈ సీజన్​లో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్న వడ్లను డీఫాల్ట్​ మిల్లులకు ఇవ్వకూడదని సర్కారు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలో వరికోతలు, వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కావడానికి మరో నెల రోజులు టైమ్​ఉండగా.. ఈలోగా ఎన్ని మిల్లులు డీఫాల్ట్​ లిస్ట్​లో మిగులుతాయో వాటికి వడ్లు కేటాయించేది లేదని సివిల్​సప్లయిస్​ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

టార్గెట్​2 లక్షల మెట్రిక్​ టన్నులు

ఈ ఏడాది సన్నాలకు ప్రభుత్వం రూ.500 బోనస్​ ప్రకటించడంతో జిల్లాలో వానాకాలం సీజన్​లో అత్యధిక విస్తీర్ణంలో రైతులు వీటినే సాగు చేశారు. 2.10 లక్షల మెట్రిక్​టన్నుల సన్నాలు, లక్ష టన్నుల దొడ్డు వడ్లు దిగుబడి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులో రైతులు తిండికి ఉంచుకోవడంతో పాటు మిల్లర్లు, వ్యాపారులు కలిసి లక్ష టన్నులు కొనుగోలు చేసే అవకాశముంది.

 మిగతా 2 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అంచనా వేసిన అధికారులు.. జిల్లావ్యాప్తంగా 326 సెంటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్​పంపారు. ఈసారి సన్నాలు, దొడ్డు రకాల కొనుగోలుకు వేర్వేరు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సన్నాలను మిల్లింగ్​ చేసి సివిల్​ సప్లయ్​కి, దొడ్డు బియ్యాన్ని ఎఫ్​సీఐకి కేటాయించనున్నారు. సన్నాల మిల్లింగ్​కు సంబంధించి క్వింటాల్​కు 58 కిలోల బియ్యమే ఇస్తామని, పైగా రూ.300 బోనస్​ఇవ్వాలని మిల్లర్లు షరతులు పెట్టడంతో ఈ అంశం తేలేవరకు సన్నాలను మిల్లులకు కేటాయించొద్దని ఆదేశాలు జారీచేసింది. 

డీఫాల్ట్ లిస్టులో 39 మిల్లులు

జిల్లాలో వరి ఉత్పత్తికి అనుగుణంగా మిల్లింగ్​కెపాసిటీ లేదు. బాయిల్డ్, రా మిల్లులు కలిపి 54 మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రతి సీజన్​లో పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల తదితర జిల్లాల్లోని మిల్లులకు వడ్లను పంపుతున్నారు. ప్రస్తుతం 39 మిల్లులు డీఫాల్ట్​ లిస్ట్​లో ఉండగా, వచ్చే నెలరోజుల్లో వీటిలో 10 మిల్లులు 100 పర్సెంట్​ సీఎమ్మార్​ డెలివరీ చేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత ఇంకో 30 మిల్లుల వరకు డీఫాల్ట్​ లిస్టులో ఉండే చాన్సుంది. ఇక మిగిలిన 20 నుంచి 25 మిల్లులకు మాత్రమే వడ్లు కేటాయించనున్నారు. 

9 వేల మెట్రిక్ ​టన్నులు పెండింగ్ 

2019-–20 యాసంగి సీజన్ నుంచి 2022-–23 యాసంగి సీజన్లకు సంబంధించి 9 వేల మెట్రిక్​టన్నుల సీఎమ్మార్ ​పెండింగ్​ ఉంది. ప్రభుత్వం మిల్లింగ్ కోసం కేటాయించిన వడ్లను కొంతమంది మిల్లర్లు అమ్ముకున్నారు. మరికొందరు మిల్లింగ్​ చేసి సీఎమ్మార్ ​డెలివరీ ఇవ్వకుండా మార్కెట్​లో ఎక్కువ రేట్లకు అమ్ముకున్నారు. 

ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్​గా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తూ మిల్లర్లకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే జిల్లాలో 100 శాతం సీఎమ్మార్, 25 పర్సెంట్​ పెనాల్టీ కలుపుకొని నేటికి 9 వేల మెట్రిక్​ టన్నుల సీఎమ్మార్​ పెండింగ్​ ఉందని భావిస్తున్నారు. 

17 మందిపై ఆర్ఆర్ యాక్ట్

జిల్లాలో సీఎమ్మార్ పెండింగ్ ఉన్న 17 మంది రైస్ మిల్లర్లపై సివిల్ సప్లై అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు. ఈ చట్టం ప్రకారం భారీగా బియ్యం బకాయిలు ఉన్న మిల్లర్ల ఆస్తులను జప్తు చేయను న్నారు. బుధవారం బెల్లంపల్లి మండలం కన్నాలలోని ఓ రైస్ మిల్లును సీజ్ చేశారు.