- పోలీసు స్టేషన్ లో హెయిర్‌డై తాగిన వ్యక్తి
- మంచిర్యాల జిల్లా తాళ్ల గురిజాలలో ఘటన
బెల్లంపల్లి, వెలుగు: తన కూతురిని భార్య చూపించడం లేదంటూ భర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బెల్లంపల్లి టౌన్ బూడిద గడ్డ బస్తీకి చెందిన వెంగళ శిరీష, టేకులబస్తీకి చెందిన బొల్లి సుమిత్ చంద్ర 2021 నవంబర్ లో లవ్ మ్యారేజ్ చేసుకోగా.. వీరికి కూతురు పుట్టింది. దంపతుల మధ్య గొడవలు అవుతుండగా గతేడాది శిరీష బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో భర్తపై కేసు పెట్టింది. గురువారం బెల్లంపల్లిలో కోర్టు వాయిదా ఉండగా దంపతులు వచ్చారు.
భార్య వద్దకు వెళ్లి తన కూతురును ఎందుకు చూపించడం లేదంటూ ప్రశ్నించాడు. వెంటనే ఆమె సమీపంలోని తాళ్ల గురిజాల పీఎస్ కు వెళ్లి తన భర్త కొట్టడానికి వచ్చాడని ఫిర్యాదు చేయగా సుమిత్ చంద్రను పిలిపించి మందలించారు. దీంతో మనస్తాపం చెందిన అతడు అప్పటికే తన వెంట తెచ్చుకున్న హెయిర్‌డైని పీఎస్ లోనే తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే బాధితుడిని బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.