3 కిలోల బంగారంతో...మణప్పురం గోల్డ్ బ్రాంచ్ ​మేనేజర్​ పరార్

  • వికారాబాద్​ జిల్లాలో ఘటన

వికారాబాద్, వెలుగు: కస్టమర్ల నెత్తిపై మణప్పురం గోల్డ్  బ్రాంచ్  మేనేజర్  టోపీ పెట్టాడు. వారు తాకట్టు పెట్టిన 3 కిలోల బంగారంతో ఉడాయించాడు. వికారాబాద్  జిల్లా అలంపల్లిలోని మణప్పురం గోల్డ్ లోన్  సంస్థలో ఇటీవల జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి అలంపల్లి బ్రాంచిలో 7 తులాల బంగారం పెట్టి రూ.3.30 లక్షల లోన్​ తీసుకున్నాడు. ఇటీవల డబ్బు చెల్లించి బంగారం తీసుకునేందుకు మణప్పురం ఆఫీసుకు వెళ్లగా బ్రాంచ్​ మేనేజర్​ విశాల్​ ‘‘రేపు రండి. సర్వర్ డౌన్ ఉంది’ అని రాజేందర్​రెడ్డిని తిప్పి పంపాడు.

కొన్ని రోజుల పాటు ఇలానే సమాధానం చెప్పాడు. ఎక్కడో తేడా కనిపిస్తున్నదని రాజేందర్ కు అనుమానం వచ్చి బ్యాంకు సిబ్బందిని నీలదీశాడు. దీంతో అసలు విషయం బయటికి వచ్చింది. అప్పటికే బ్రాంచ్​ మేనేజర్​ విశాల్​3 కిలోల బంగారంతో పరారైనట్లు తెలిసింది. దీంతో వినియోగదారులు శనివారం ఆఫీసుకు వెళ్లారు.

తాము తాకట్టు పెట్టిన బంగారానికి సంస్థ బాధ్యత వహించాలని డిమాండ్  చేశారు. ఈ సందర్భంగా సంస్థ లీగల్ సెల్  ఇన్ చార్జి శంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 3 కిలోలు ఉన్న 60 బంగారం ప్యాకెట్లతో మేనేజర్  విశాల్  పారిపోయాడని చెప్పారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరి బంగారానికి పూర్తి బాధ్యతను తామే తీసుకుంటామన్నారు. 15 రోజుల్లో గోల్డ్  లేదా అమౌంట్  తిరిగి ఇస్తామని హామీ ఇచ్చా రు.