- బాధితురాలి ఫ్యామిలీకి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం
- సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
- 11 నెలల్లోనే దోషికి శిక్ష పడేలా చేసిన పోలీసులను అభినందించిన జడ్జి
- సంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు
సంగారెడ్డి, వెలుగు: ఐదేండ్ల పాపపై అత్యాచారం, హత్య కేసులో దోషికి మరణశిక్ష విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సంగారెడ్డి కోర్టులో 27 ఏండ్ల తర్వాత మరోసారి ఉరి శిక్ష విధించడం గమనార్హం. కేసు వివరాలను సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ మీడియాకు వెల్లడించారు. బిహార్ రాష్ట్రం జిమోయి జిల్లా సికిందర్ తాలూకాకు చెందిన గఫార్ అలీ(56) బీడీఎల్ భానుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్య కంపెనీ పక్కన లేబర్ రూమ్ లో నివాసం ఉంటున్నాడు. అదే రాష్ట్రం నుంచి వలస వచ్చి స్థానికంగా నివాసం ఉంటున్న శంకర్, అతని భార్య ఉమాదేవి గతేడాది అక్టోబర్ 16న తమ ఐదేండ్ల మనవరాలిని అదే కంపెనీ సెక్యూరిటీ గార్డ్ వద్ద ఉంచి పనికి వెళ్లారు. పక్కేనే ఉన్న గఫార్.. ఆ పాప తనకు తెలుసని, కూల్ డ్రింక్ తాగించి తీసుకొస్తానని చెప్పి చిన్నారిని తీస్కెళ్లాడు.
ఆ పాపకు మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి చంపేశాడు. పాప కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్పటి ఎస్సై రవీందర్ రెడ్డి నిందితుడిని పట్టుకుని కేసు ఫైల్ చేసి కోర్టులో హాజరుపర్చారు. గురువారం తుది వాదనలు విన్న పోక్సో కోర్టు గఫార్ అలీకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధితురాలి రక్త సంబంధీకులకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని జస్టిస్ జయంతి ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని హైకోర్టు నుంచి స్పీడ్ ట్రయల్ అనుమతులు పొందారు. మొత్తం 11 నెలల్లోనే దోషికి శిక్ష పడేలా చేసిన రూపేశ్‌ను న్యాయమూర్తి అభినందించారు. ఈ కేసులో పనిచేసిన అదనపు ఎస్పీ సంజీవ రావు, అశోక్, అప్పటి ఎస్సై రవీందర్ రెడ్డి, ఇన్సిపెక్టర్ బిడియల్ భానూర్, ఇన్వెస్టిగేషన్ అధికారులు పురుషోత్తంరెడ్డి, పీపీలు అనంత రావ్ కులకర్ణి, కృష్ణ, భరోసా లీగల్ సపోర్ట్ పర్సన్ సౌజన్య, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ వెంకటేశ్వర్లు, రఫీక్, సీతా నాయక్, కోర్ట్ లైజనింగ్ అధికారి కె.సత్యనారాయణ, ఎస్ఐ. డీసీఆర్బీ ఇన్సిపెక్టర్ రమేశ్‌ను ఎస్పీ అభినందించారు.