మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యేదెన్నడు?

  • నత్తనడకన జిల్లా ఆస్పత్రి, మెడికల్​ విద్యార్థుల వసతి గృహాల నిర్మాణ పనులు ​  
  • వేర్వేరు చోట్ల తరగతులు, వసతి ఏర్పాట్లతో మెడికల్​ విద్యార్థులకు ఇబ్బందులు

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రి, మెడికల్ కాలేజీ వసతి గృహం భవన నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. రెండేండ్ల నుంచి నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు కొంత మేరకు పూర్తి చేసి తరగతులను ప్రారంభించారు. కాలేజీకి అనుసంధానంగా వసతిగృహాలు, హాస్పిటల్​ నిర్మాణ పనులను రెండేండ్లుగా చేపడుతూనే ఉన్నారు.  కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనుల్లో జరుగుతోంది.

సమస్యగా మారిన బిల్లుల మంజూరు..

కాంట్రాక్టర్లు పనులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నా, బిల్లుల మంజూరులో జాప్యం కారణంగా సమయానికి పనులు పూర్తి కావడం లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ. 116 కోట్లు, జిల్లా ఆస్పత్రికి రూ.39 కోట్లు, క్రిటికల్ కేర్ భవన నిర్మాణానికి రూ. 23 కోట్లు, జిల్లా మెడికల్ స్టోర్ కోసం రూ.3 కోట్లను కేటాయించారు. రెండేండ్ల కింద పనులు ప్రారంభమైనా ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదు.  

మెడికల్​ కాలేజీలో 450 మంది విద్యార్థులు..

జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో మూడో బ్యాచ్ ప్రారంభం కాగా, మొత్తంగా 450 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. తరగతులు ఒక చోట, వసతి సౌకర్యం మరోచోట ఉండడంతో కొంతమంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లను ఆశ్రయిస్తున్నారు. కొన్ని రోజుల పాటు మెడికల్​ కాలేజీ ఆధ్వర్యంలో బస్సులను నడిపించగా ప్రస్తుతం వాటిని తొలగించారు. విద్యార్థులకు  ప్రైవేట్ వాహనాలే దిక్కవుతున్నాయి. మహబూబాబాద్​పట్టణం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో కాలేజీ ఉండడం, సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 

ALSO READ : ట్రిపుల్ ఆర్ ల్యాండ్​కు.. రేటు పెంపు ప్రపోజల్స్

పనుల్లో వేగంపెంచాలని చెప్పాం

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, విద్యార్థుల వసతి గృహల నిర్మాణ పనులను వేగంగా చేపట్టాలని కాంట్రాక్టర్లును కోరాం. నిర్మాణ పనుల్లో జాప్యం మూలంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి బిల్లులుసకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. -  లకావత్​వెంకట్, మెడికల్ కాలేజీ  ప్రిన్సిపల్, మహబూబాబాద్​