కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్థిక‌‌‌‌‌‌‌‌నేరాలే ఎక్కువ..కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ పరిధిలో అన్ని రకాల కేసులు

  • 2,282 సైబర్ క్రైం కేసులు నమోదు
  • భూకబ్జా కేసుల్లో 179 మంది జైలుకు 
  • ఇసుక అక్రమ రవాణా ఘటనల్లో 610 కేసులు.. 1198 మంది అరెస్ట్  
  • నిరుడితో పోలిస్తే తగ్గిన హత్యలు, దొమ్మీలు, చైన్ స్నాచింగ్‌‌‌‌‌‌‌‌లు 
  • వార్షిక క్రైమ్‌‌‌‌‌‌‌‌ రివ్యూలో సీపీ అభిషేక్‌‌‌‌‌‌‌‌ మహంతి వెల్లడి


కరీంనగర్, వెలుగు:కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే 2024లో ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు భారీగా నమోదయ్యాయి. 2023లో కమిషనరేట్ వ్యాప్తంగా 14,296 ఫిర్యాదులు అందగా, 2024లో 18,625 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 2023లో 6,041 కేసులు నమోదు కాగా, 2024లో 7,027 కేసులు నమోదయ్యాయి. 

ఇందులో అత్యధికంగా ఆర్థిక నేరాలకు సంబంధించినవి 23 శాతం కాగా, శారీరక నేరాలు 11 శాతం, రోడ్డు ప్రమాదాలు 5 శాతం, ఇతర నేరాలన్నీ కలిపి 61 శాతంగా నమోదైనట్లు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి సోమవారం మీడియాకు వెల్లడించారు. నిరుడితో పోలిస్తే భూకబ్జా, సైబర్ క్రైం, ఇసుక అక్రమ రవాణా, చిట్ ఫండ్, జాబ్ ఫ్రాడ్ కేసులు భారీగా పెరగగా.. హత్యలు, దొమ్మీలు, చైన్ స్నాచింగ్ లాంటి కేసులు తగ్గుముఖం పట్టాయి. 

భూసంబంధిత కేసుల్లో 179 మంది కటకటాల్లోకి.. 

2023లో సీపీ ఆఫీసుకు 1,301 ఫిర్యాదులు అందగా.. 2024లో 3,121 ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది ఆర్థిక నేరాలకు సంబంధించి మొత్తం 726 కేసులు నమోదయ్యాయి. ఇందులో భూతగాదాలు, నకిలీ పేపర్లతో భూకబ్జా ఘటనల్లో నమోదైనవి 113 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు, కార్పొరేటర్లు సహా 179 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల్లో 60 వరకు నకిలీ సరిహద్దులు సృష్టించినవే ఉన్నాయి. ఈ ఏడాది చిట్ ఫండ్ మోసాలకు సంబంధించి 50 కేసులు నమోదుకాగా 9 మంది చిట్ ఫండ్ డైరక్టర్స్ తో సహా 16 మందిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ ఏడాది జాబ్ ఫ్రాడ్ మోసాలకు సంబంధించి 33 కేసులు నమోదు కాగా 27 మందిని అరెస్ట్ చేశారు.

పెరిగిన సైబర్ నేరాలు

2023లో సైబర్ నేరాలకు సంబంధించి 1,654 ఫిర్యాదులు రాగా, ఈ ఏడాది 2,282 ఫిర్యాదులు అందాయి. వీటిలో నిరుడు ఆర్థిక సైబర్ నేరాలు 258 కేసులు కాగా, ఈ ఏడాది 270 కేసులు నమోదయ్యాయి. 2023లో 114 కేసుల్లో బాధితులు కోల్పోయిన రూ.1.74 కోట్లను పుట్ఆన్ హోల్డ్ లో ఉంచగా, 2024లో 233 కేసుల్లో బాధితులు కోల్పోయిన రూ.9.87 కోట్లను పుట్ ఆన్ హోల్డ్ లో ఉంచగలిగినట్లు సీపీ వెల్లడించారు. అలాగే ఈ ఏడాది రూ.2.57 కోట్లను బాధితులకు అప్పగించుటకు కోర్టు ద్వారా ఉత్తర్వులు పొందారు. ఈ ఏడాది అల్లర్లు, దొమ్మీ కేసులు 14, దోపిడీ కేసులు 5, హత్య కేసులు 14, చైన్ స్నాచింగ్‌‌‌‌‌‌‌‌లు 7, ప్రాణాంతక రోడ్డు యాక్సిడెంట్ కేసులు 184 నమోదయ్యాయి. 

ఇసుక కేసులు నిరుడు 27.. ఈ ఏడాది 610 

ఇసుక అక్రమ రవాణా చేసినందుకు 2023లో 27 కేసులు నమోదుకాగా.. 120 మందిని అరెస్ట్ చేసి, 244 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈఏడాది 610 కేసులు నమోదు కాగా, 1,198 మంది అరెస్ట్ చేశారు. 797 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 2023లో వాహన తనిఖీలు, స్పెషల్ డ్రైవ్ ల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన 5,329 మందిపై కేసులు నమోదుకాగా, 53 మందికి జైలు శిక్ష పడింది. 2024లో 6,005 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, 147 మందికి జైలు శిక్ష పడింది.