గత ప్రభుత్వాలు గురుకులాలను పట్టించుకోలే : కొండా సురేఖ

  • 16 ఏళ్ల తర్వాత  డైట్​, కాస్మొటిక్ చార్జీలు పెరిగాయి
  • మంత్రి కొండా సురేఖ

సంగారెడ్డి, వెలుగు: గత ప్రభుత్వాలు గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లను పట్టించుకోలేదని అటవీ శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖ విమర్శించారు. ఆడపిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలి కానీ గతంలో అది జరగలేదన్నారు. పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి 16 ఏళ్లుగా పెరగని కాస్మొటిక్ ఛార్జీలను ఇప్పుడు పెంచారన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూరలోని అంబేద్కర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో శనివారం కామన్ డైట్ ను మంత్రి కొండా సురేఖ ప్రారంభించి స్టూడెంట్స్​తో కలిసి భోజనం చేశారు. 

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదికపై మంత్రి మాట్లాడారు. ఆరోగ్యకరమైన ఫుడ్ స్టూడెంట్స్​కు అందేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. 8 ఏళ్లుగా డైట్ చార్జీలు పెరగలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రభుత్వాన్ని బద్నాం చేయడం తప్ప సూచనలు ఇవ్వాలనే ఆలోచన వాళ్లకు లేకుండా పోయిందన్నారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడిన మంత్రి భయపడాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చారు.

అనంతరం అక్కడి స్టోర్ రూమ్ ను పరిశీలించి పప్పు దినుసులు, జీలకర్ర, పల్లీలు సరిగ్గా లేకపోవడంతో వాటి శాంపిల్స్ సేకరించి అధికారులకు అప్పగించారు. నాణ్యత లేని సరుకులను ల్యాబ్ కు పంపించి వాటి రిపోర్ట్స్ ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. మంత్రి వెంట కలెక్టర్ క్రాంతి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు, రెసిడెన్షియల్ సిబ్బంది, స్టూడెంట్స్ పాల్గొన్నారు.

టూరిస్ట్ స్పాట్​గా నర్సాపూర్ అర్బన్ పార్క్

నర్సాపూర్: నర్సాపూర్ అర్బన్ పార్క్ ను అద్భుతమైన టూరిజం స్పాట్​గా  తీర్చిదిద్దుతామని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం ఆమె మెదక్ జిల్లా నర్సాపూర్  ఫారెస్టులోని అర్బన్ పార్క్​ను సందర్శించి అక్కడ మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ. నర్సాపూర్ అర్బన్ పార్క్​ను బొటానికల్​లాగా  తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నందున ఎక్కువ మంది పర్యాటకులు వస్తారన్నారు. టూరిస్ట్ లకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎకో టూరిజం స్పాట్​గా చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్​పర్సన్​ సుహాసిని రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి, డీసీసీ  ప్రెసిడెంట్ ఆంజనేయలు గౌడ్ పాల్గొన్నారు. 

అంబులెన్స్​ కోసం మంత్రికి వినతి

శివ్వంపేట: శివ్వంపేట మండలానికి అంబులెన్స్​ మంజూరు చేయించాలని మండల కాంగ్రెస్​ నాయకులు మంత్రి సురేఖకు వినతి పత్రం అందజేశారు. పీహెచ్​సీని 30 పడకల స్థాయికి అప్​ గ్రేడ్​ చేయాలని కోరారు. జూనియర్​ కాలేజీకి భవనం లేక స్టూడెంట్స్​ఒకే రూములో  తరగతులు నిర్వహిస్తుండడం సమస్యగా ఉందన్నారు. కాలేజీ బిల్డింగ్​ మంజూరు చేయాలని, పోలీస్​ సిబ్బందికి క్వార్టర్లు, సీసీ రోడ్లు మంజూరు చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, నాయకులు నవీన్ గుప్తా, శ్రీనివాస్ గౌడ్, కరుణాకర్ రెడ్డి,  వెంకట్రాంరెడ్డి, నగేశ్, రమేశ్ గౌడ్,  శ్రీనివాస్ గౌడ్  మంత్రికివిన్నవించారు.