- ఈనెల 21 నుంచి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు అనుమతి
- మాల్స్, రెస్టారెంట్లలో రద్దీ 50 శాతం మించకూడదు
బెంగళూరు: గత రెండున్నర నెలలుగా కరోనా కల్లోలంతో తల్లడిల్లిన కర్నాటక కేసులు తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు తేరుకుంటోంది. కఠిన కర్ఫ్యూ ఆంక్షల నేపధ్యంలో భారీగా కేసులు తగ్గిపోవడంతో ఊపిరి పీల్చుకుంటోంది. ఈ నేపధ్యంలో ప్రజలకు ఆంక్షలను సడలించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 21 నుంచి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, స్పా, సెలూన్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేసుకునేందుకు కర్నాటక సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే జనం రద్దీని నియంత్రించాలని, 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని షరతు విధించింది.
కరోనా బెడద ఇంకా తొలగిపోనందున మరో రెండు వారాల వరకు జిమ్, యోగా సెంటర్లు, దేవాలయాలు, సినిమా థియేటర్లు తెరవరాదని నిర్ణయించింది. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లపై ఈనెల 21వ తేదీన నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రస్తుతం కర్నాటకలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 5,983 కరోనా కేసులు నమోదు కాగా 138 మంది చనిపోయారు. అలాగే 10 వేల 685 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుండి విడుదలైనట్లు కర్నాటక వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
