NZ vs ENG: న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. కొత్త రికార్డ్ సెట్ చేసిన విలియంసన్

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియంసన్ నయా రికార్డ్ సెట్ చేశాడు. రెండో ఇనింగ్స్ 61 పరుగులు చేసిన విలియంసన్ 9000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.దీంతో న్యూజిలాండ్ క్రికెట్  తరపున టెస్టుల్లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్ గా ఆ దేశ క్రికెట్ చరిత్రలో నిలిచాడు.  మాజీ బ్యాటర్ రాస్ టేలర్ 7683 పరుగులతో  రెండో స్థానంలో స్థానంలో కొనసాగుతున్నాడు.
 
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఫ్యాబ్ ఫోర్ లో ఒకడైన  విలియంసన్ కు ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్ గా నిలిచాడు. జో రూట్ (12754 పరుగులు), స్టీవ్ స్మిత్ (9702 పరుగులు), విరాట్ కోహ్లీ (9145 పరుగులు) రెడ్-బాల్ ఫార్మాట్‌లో ఇప్పటికే 9000 పరుగుల క్లబ్ లో చేరి విలియమ్సన్ కంటే ముందున్నారు. 103 టెస్టులాడిన విలియంసన్ 54 యావరేజ్ తో 9001 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు.. 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టులో విలియంసన్ బాగా ఆడినప్పటికీ న్యూజిలాండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ప్రస్తుతం కివీస్ నాలుగు పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 348 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 499 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ 171 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు భారీ ఆధిక్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు. 


టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు

1.    కేన్ విలియమ్సన్(9001*)    
2.    రాస్ టేలర్    (7683)    
3.    స్టీఫెన్ ఫ్లెమింగ్    (7172)    
4.    బ్రెండన్ మెకల్లమ్    (6453)    
5.    టామ్ లాథమ్    (5711)