కోర్టులు తీర్పులని తగు కారణాలతో, సకాలంలో వెలువరించాలి. ఆ విధంగా వెలువరించినప్పుడే కోర్టుల మీద విశ్వసనీయత పెరుగుతుంది. తగు కారణాలు చెప్పకుండా తీర్పులను ప్రకటించడం మానివేయాలని సుప్రీంకోర్టు తరుచూ చెబుతోంది. కానీ, హైకోర్టు న్యాయమూర్తులు ఈ విషయాలను అంతగా పట్టించుకున్నట్లు అనిపించడం లేదు. ఈ మధ్య మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించిన రెండు తీర్పులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తరువాత తీర్పుని విడుదల చేశారన్న ఏకైక కారణంగా.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి వెలువరించిన తీర్పుని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 2024లో రద్దు చేసింది. ఒక న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తర్వాత ఫైలు తన దగ్గర ఉంచుకోవడం అనుచితమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ కేసుని తిరిగి విచారించమని మద్రాస్ హైకోర్టుకు తిప్పి పంపింది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఒకే ఒక వాక్యంతో 17 ఏప్రిల్ 2017న ప్రకటించారు. ఆ న్యాయమూర్తి 26 మే 2017న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత పూర్తి తీర్పుని వివరణాత్మకంగా 23 అక్టోబర్ 2017న విడుదల చేశారు. అంటే, పదవీ విరమణ తరువాత ఐదు నెలలకి పూర్తి తీర్పు పాఠం అందుబాటులోకి వచ్చింది. ఈ తీర్పుని సీబీఐ.. సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పదవీ విరమణ చేసిన తర్వాత తీర్పును ప్రకటించారన్న కారణాన్ని సీబీఐ.. సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా పేర్కొంది. ఈ కేసులో ( స్టేట్ త్రూ సీబీఐ వర్సెస్ నరేష్ ప్రసాద్ అగర్వాల్, 2024 లైవ్‌లో (సుప్రీంకోర్టు. 133) హైకోర్టు న్యాయమూర్తి వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు విమర్శనాత్మకంగా తీసుకుని ఈ విధంగా వ్యాఖ్యానించింది.. ‘పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆ న్యాయమూర్తి కారణాలు రాసి తీర్పును సిద్ధం చేశారు. 5నెలల పాటు ఆ కేసు ఫైలును ఆ విధంగా ఉంచడం అనుచితమైన చర్య. ఈ కేసులో ఏం జరిగి ఉంటుందో మేం లెక్కపెట్టదల్చుకోలేదు’ అని పేర్కొంది.
న్యాయం జరిగినట్టు అన్పించాలి
‘న్యాయం జరగడమే కాదు. జరిగినట్టు కూడా అన్పించాలని’ లార్డ్ హెవార్ట్ వంద సంవత్సరాల క్రితం చెప్పాడు. అతను చెప్పినదానికి విరుద్ధంగా ఈ కేసులో జరిగింది. ఇలాంటి అనుచిత చర్యలను మేం సమర్థించలేం. ఈ తీర్పును రద్దు చేసి తిరిగి తాజా నిర్ణయం కోసం హైకోర్టుకి పంపించడమే మాకు అందుబాటులో ఉన్న అంశం’. కేసుని మద్రాస్ హైకోర్టుకి తిప్పి పంపిస్తూ ఈ కేసులోని ‘యోగ్యతలని మేం పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది.
న్యాయమూర్తి రెండో తీర్పు
ఈ న్యాయమూర్తి వెలువరించిన మరో తీర్పుని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీహ్లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ కేసులో హైకోర్టు సింగిల్‌జడ్జి సింగిల్ లైన్ జారీ చేశారు. ఆ న్యాయమూర్తి పదవీ విరమణ చేసేవరకు వివరణాత్మక తీర్పు అందుబాటులోకి రాలేదని సీబీఐ వాదన చేసింది. ఈ విషయం మీద నివేదికను సమర్పించాలని మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈక్రమంలో ఈ కింది సమాచారాన్ని అందించాలని రిజిస్ట్రార్‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
1. ఆ న్యాయమూర్తి నుంచి వివరణాత్మకమైన
తీర్పు రిజిస్ట్రీకి ఎప్పుడు అందింది?
2. ఆ వివరణాత్మకమైన తీర్పుని ఎప్పుడు అప్‌లోడ్‌చేశారు?
3. ఆ న్యాయమూర్తి విచారించిన 9 కేసుల్లో తిరిగి విచారించాలని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమైనా పరిపాలనా ఆదేశాలు జారీ చేశారా?ఒకవేళ ఉంటే ఈ సుప్రీంకోర్టు ముందు ఉన్న ఎస్ఎల్పీలో ఉన్న అంశం ఆ కేసుల్లో ఉందా? తదితర అంశాలపై సమాచారం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆదాయపు పన్ను అధికారి కేసు..
ఇక, ఈ కేసు విషయంలోకి వస్తే.. ఈ కేసులోని ముద్దాయి 1999వ బ్యాచ్‌కి చెందిన ఆదాయపు పన్ను అధికారి. అతను ఆదాయపు పన్ను అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. అతను అక్రమాస్తులు సంపాదించాడన్న ఆరోపణలతో అతనిపై కేసుని నమోదు చేశారు. ఆయన, అతని భార్య అక్రమాస్తులు కూడబెట్టినారని ఆ ఎఫ్ఐఆర్లో ఆరోపణ. హైకోర్టు వెబ్సైట్లో ఉన్న తీర్పు ప్రకారం.. వ్యక్తిగత పగతో, దురుద్దేశంతో అతనిపై విచారణని ప్రారంభించినట్లు కనిపిస్తుందని హైకోర్టు భావించి ఎఫ్ఐఆర్ని రద్దు చేసింది. 15 మే 2017న సింగిల్ లైన్ తీర్పుని ఆ న్యాయమూర్తి ప్రకటించారని సీబీఐ సుప్రీంకోర్టులో పేర్కొంది. అదేరోజు తీర్పు ప్రతికోసం తాము దరఖాస్తు చేశామని అయితే వివరణాత్మక తీర్పు రాలేదని తమకు మౌఖికంగా రిజిస్ట్రీ తెలియజేసిందని సీబీఐ సుప్రీంకోర్టుకి తెలియజేసింది. ఆ హైకోర్టు న్యాయమూర్తి 26 మే 2017న సీబీఐకి హైకోర్టు రిజిస్ట్రీఅందించింది. పదవీ విరమణ చేసేంతవరకు ఆ న్యాయమూర్తి తగు కారణాలని చూపించలేదన్నది సీబీఐ వాదన. సీబీఐ ప్రకారం ఆ న్యాయమూర్తి విచారించిన తొమ్మిది కేసుల్లో మళ్లీ విచారణ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయని సుప్రీంకోర్టు దృష్టికి సీబీఐ తీసుకువచ్చింది. ఈ కేసులోని విషయాల గురించి మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్జనరల్ నుంచి తీసుకుని తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
పదవీ విరమణ తర్వాత తీర్పులు..
పదవీ విరమణ తరువాత తీర్పులను ప్రకటించడమనేది ఒక్క మద్రాస్ హైకోర్టుకే పరిమితం కాలేదు. గతంలో అలహాబాద్ హైకోర్టు సురేంద్ర ప్రభాస్ వర్సెస్ విశ్వరాజ్ సింగ్ కేసులో ఇదేవిధంగా జరిగింది. 2020వ సంవత్సరంలో బాలాజీ బలరాం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఇదేవిధమైన జాప్యం జరిగింది. గత జూన్‌లో ఇలాంటి సంఘటనలు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి వచ్చి ఆయన కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. పదవీ విరమణ చేసిన తరువాత న్యాయమూర్తులు తమ చాంబర్లను ఉపయోగించుకోకూడదు. న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన మూడురోజుల్లో కేసు రికార్డుని రిజిస్ట్రీకి ఆ న్యాయమూర్తి సిబ్బంది అందజేయాలి. పదోన్నతి పొందిన న్యాయమూర్తులు, బదిలీ అయిన న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో తమ చాంబర్లని ఉపయోగించుకోవచ్చు. న్యాయమూర్తులు తమ తీర్పులను సంతకాలు చేసి అదేరోజు అందజేయాలి. అది ఆ అర్ధరాత్రికి మించడానికి వీల్లేదు. జిల్లా జ్యుడీషియరీకి మార్గదర్శకత్వం వహించాల్సిన హైకోర్టు న్యాయమూర్తులు సింగిల్ లైనులో తీర్పులు ప్రకటించడం, పదవీ విరమణ తరువాత లేదా ఆలస్యంగా తీర్పులను ప్రకటించడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి న్యాయమూర్తుల మీద సుప్రీంకోర్టు ఏమైనా చర్యలు తీసుకోగలదా.. కష్టమే.
- డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్)