ప్రియురాలితో గడిపి.. బయటపడకుండా చోరీ డ్రామా

ప్రియురాలితో గడిపి.. బయటపడకుండా చోరీ డ్రామా
  • పోలీసుల కేసు నమోదుతో కదిలిన డొంక

న్యూఢిల్లీ: ప్రియురాలితో సంబంధం వ్యవహారం దాచిపెట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. మామూలుగా తప్పు ఒప్పుకుని ఉంటే అది భార్య వరకే పరిమితమైపోయేదేమో కానీ.. అందమైన అబద్దంతో కప్పిపెట్టేందుకు చేసిన యత్నంతో కథ అడ్డం తిరిగింది. సోషల్ మీడియా వేదికగా ఓ పేరు మోసిన జర్నలిస్టు చేసిన పోస్టుపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. సుమోటోగా కేసు నమోదు చేయడంతోపాటు.. చిన్న కేసు అయినప్పటికీ ఛాలెంజ్ గా తీసుకుని  పోలీసులు కూపీ లాగడంతో డొంక కదిలింది. 
ఆయన ఎక్కడెక్కడ తిరిగింది.. ఎవరితో తిరిగింది.. ఆధారాలు.. ఫోటోలు.. వీడియోలు సంపాదించిన పోలీసులు.. ఆయన  సోషల్ మీడియా పోస్టుకు కౌంటర్ గా సోషల్ మీడియాలోనే ప్రకటన చేయడంతో అయ్యగారి రాసలీల వ్యవహారం బట్టబయలైంది. పోలీసుల చర్యతో ఆయన తేలుకుట్టిన దొంగలా మారిపోగా.. నెటిజనులు ఓ ఆట ఆడుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా కేంద్రంగా జరిగిందీ వ్యవహారం.
 ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా కేంద్రంగా నడిచే ‘‘ఖబర్’’ హిందీ మీడియా ఛానెల్ కు అతుల్ అగర్వాల్ ఎడిటర్ ఇన్ చీఫ్. ఈనెల 19వ తేదీన అర్ధరాత్రి తనపై దాడి జరిగిందని, దుండగులు కత్తి చూపించి 5 వేల రూపాయలు లాక్కున్నారని.. చంపేస్తారేమోనని భయంతో బతిమాలుకుంటే వదిలేశారని ఫేస్ బుక్ లో  పోస్టు  చేశాడు. అయితే దీనిపై పోలీసులు ఆగ్రహంతో రగలిపోయారు. అసలే మోపెడు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. ఈ జర్నలిస్టు పనిగట్టుకుని తమ పరువు తీస్తున్నాడని భావించి తీవ్రంగా స్పందించారు. ప్రాథమిక విచారణలోనే తప్పుడు ప్రకటన అని తేలిపోయింది. అంతేకాదు.. ఆయన గారి వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో వాస్తవాలు వెలికితీసేందుకు కేసు నమోదు చేసి ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. 
ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే...
అతుల్ అగర్వాల్ ఈనెల 19వ తేదీన సాయంత్రం స్టూడియో నుంచి నేరుగా ప్రియురాలి ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 7 నుంచి 11 వరకు అక్కడే ఉన్నాడు. 11 గంటల సమయంలో భార్య చిత్ర (మహిళా జర్నలిస్ట్) నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయినా నేరుగా ఇంటికి వెళ్లలేదు. ఓయోకు ఫోన్ చేసి రూమ్ బుక్ చేసి ప్రియురాలిని రూమ్ కు పిలిపించుకున్నాడు. రాత్రంతా ఆమెతోనే అదే గదిలో గడిపాడు. ఆయన స్టూడియో నుంచి బయటకొచ్చింది మొదలు ఎక్కడెక్కడ తిరిగిన వివరాలన్నీ పోలీసులు ట్రేస్ చేశారు. తొలుత నేరుగా ప్రియురాలి ఇంటికి.. అక్కడి నుంచి ఓయో ద్వారా బుక్ చేసిన హోటల్ గదికి వెళ్లి అక్కడే రాత్రంతా గడిపిన సీసీ కెమెరాల వీడియోలు.. ఫోటోలు సంపాదించారు. అంతేకాదు.. ఓయో ద్వారా రూమ్ గదికి బుక్ చేసేటప్పుడు ఆన్ లైన్ పేమేంట్ చేసిన రశీదు కూడా సేకరించారు. వీటన్నింటినీ ఉటంకిస్తూ.. అతుల్ అగర్వాల్ ఫేక్ కథనం అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా రచ్చ రచ్చ అయింది. నెటిజనులు ట్రోలింగ్ చేస్తూ ఆటాడుకున్నారు.