సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెపై స్పందించండి : జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల మంది సర్వ శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ ల సాధన కోసం 19రోజులుగా  సమ్మె చేస్తున్నారని, వారిని వెంటనే చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. సమ్మెలో భాగంగా 33 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట దీక్షలు చేస్తున్నారని, వారి డిమాండ్లు పరిష్కరించాలన్నారు. గురువారం ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి జాజుల లెటర్ రాశారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర శిక్ష అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి ఇంకా నెరవేర్చలేదన్నారు. వారిని రెగ్యులరైజ్ చేసి విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 

విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు 19, 300 మంది 20 ఏండ్లుగా పనిచేస్తూ పెద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తన్నారని గుర్తుచేశారు. అలాంటి ఉద్యోగులను రెగ్యులర్ చేసి సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలన్నారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్  సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి  కృషి చేయాలన్నారు. సమ్మె చేస్తున్న వారంతా బడుగు బలహీన వర్గాల ఉద్యోగులేనని, వారికి అండగా బహుజన సామజం ఉంటుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.