కరీంనగర్ లోకి హుస్నాబాద్!...మరోసారి తెరపైకి వచ్చిన విలీన అంశం

  • మంత్రి వ్యాఖ్యలపై జోరుగా చర్చ
  • సోషల్ మీడియాలో వైరల్

సిద్దిపేట, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని తిరిగి  కరీంనర్ జిల్లాలో కలపాలనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా కేడం లింగమూర్తి పదవి స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంత కాలంగా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కోహెడ ఎంపీటీసీల పదవీకాలం ముగింపు సందర్భంగా ఈ విషయంపై ఎంపీటీసీలందరూ మంత్రికి వినతిపత్రం సైతం సమర్పించారు.

కరీంనగర్ లో కలిసేనా..?

జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్న పేటతో పాటు మానకొండూరు నియోజవర్గంలోని బెజ్జంకి మండలాలను సిద్దిపేట జిల్లాలో కలిపారు. హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మూడు మండలాలు సిద్దిపేట జిల్లాలో, రెండు మండలాలు కరీంనగర్ జిల్లాలో, మరో రెండు మండలాలు హన్మకొండ జిల్లా పరిధిలోకి వెళ్లడంతో నియోజకవర్గ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

హుస్నాబాద్ తో పాటు మరో రెండు మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలనే డిమాండ్ తో  స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో 50 రోజులకు పైగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. రెండేళ్ల కింద పీసీసీ అధ్యక్షుడి హోదాలో హుస్నాబాద్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి ఈ మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలనే డిమాండ్ కు మద్దతు తెలపగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో  పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతానని హామీ ఇచ్చారు.

సిద్దిపేటతో పోలిస్తే కరీంనగర్ జిల్లా కేంద్రం తమకు అందుబాటులో ఉండడమే కాకుండా దశాబ్దాలుగా తాము పాత జిల్లాతో అనుబంధాన్ని పెనవేసుకున్నామనే అంశాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇందు కోసం సపోర్ట్ హుస్నాబాద్ పేరిట ప్రజల మద్దతును సేకరిస్తున్నారు.  

అదే దారిలో బెజ్జంకి మండలం

సిద్దిపేట జిల్లాలో కలిసిన బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలనే డిమాండ్ ఏండ్లుగా కొనసాగుతోంది. మానకొండూరు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బెజ్జంకిని కరీంనగర్ జిల్లాలోనే కలపాలనే డిమాండ్ కు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. 2016 లో 27 గ్రామాలతో ఉన్న బెజ్జంకి మండలాన్ని కుదించి 12 గ్రామాలతో సిద్దిపేట జిల్లాలో కలిపి మిగిలిన గ్రామాలతో కొత్తగా గన్నేరువరం మండలాన్ని ఏర్పాటు చేసి దాన్ని కరీంనగర్ జిల్లాలో కలిపారు.

గతేడాది అసెంబ్లీ ఎన్నికల  సందర్భంగా రేణికుంటలో నిర్వహించిన ప్రచార సభలో అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. 

కరీంనగర్ జిల్లాతో ఎనలేని అనుబంధం

కరీంనగర్ జిల్లాతో ఎనలేని అనుబంధాన్ని కలిగిఉన్న మమ్మల్ని బీఆర్ఎస్​ప్రభుత్వం బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపింది. అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్ మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలో  కలపాలని అప్పట్లో నిరసనలు తెలిపినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే  మూడు మండలాల్ని కరీంనగర్ జిల్లాలో కలిపి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి.- మ్యాకల రజనీకాంత్ రెడ్డి, తీగలకుంటపల్లి, కోహెడ మండలం