శామీర్ పేట్లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

మేడ్చల్: శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలను ఏస్ ఓటీ, సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోతాయపల్లి గ్రామానికి చెందిన ధనవంతుల ఇళ్లలో చోరీ చేసేందుకు రెక్కి నిర్వహించి చోరీకి పాల్పడేందుకు యత్నించారు. ఇందులో భాగంగా గ్రామంలోని ఓ వ్యాపారి ఇంటి వద్ద నిఘా పెట్టి చోరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సైబరాబాద్ ఏస్ ఓటీ, శామీర్ పేట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన డెకాయిటీ ఆపరేషన్ లో దుండగులు పట్టుబడ్డారు.

ఇందులో  సికింద్రాబాద్ లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన చింతల రాంరెడ్డి, జవహర్ నగర్ కు చెందిన సలీం తమీం, కాప్రా ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ లు పోతాయపల్లిలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని తెలుసుకుని చోరీ చేయాలని కుట్ర పన్నారు. ఇందుకోసం కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అశ్రఫ్, తౌసిఫ్ పాషాల ముఠాకు రూ.3లక్షల సుఫారీ ఇచ్చి చోరీ చేయాలని సూచించారు.

దీంతో వ్యాపారి ఇంటి వద్ద పలు మార్లు రెక్కి నిర్వహించి చోరీకి పాల్పడేందుకు ప్రయత్నం చేస్తుండగా.. శామీర్ పేట్, ఏస్ ఓటీ పోలీసులు పక్క ప్రణాళికతో దుండగులను వెంటాడి మరీ పట్టుకున్నారు.  నలుగురు నిందితులతో పాటు రెండు కత్తులు, 5ఫోన్స్, కారు, 3 బైక్ లు, ఆటో స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించామని సీఐ తెలిపారు.