వరంగల్, కరీంనగర్.. జీసీసీలకు డెస్టినేషన్లు

  • అందుబాటులో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజినీరింగ్ కాలేజీలు
  • హైదరాబాద్​తో పోలిస్తే భూముల రేట్లూ తక్కువే 
  • తెలంగాణాస్ బ్లూ ప్రింట్ ఫర్ గ్రోత్ రిపోర్ట్​లో నాస్కామ్ వెల్లడి

కరీంనగర్, వెలుగు:హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్ నగరాలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు డెస్టినేషన్​లుగా మారనున్నాయని నాస్కామ్ తెలిపింది. జీసీసీల ఏర్పాటుకు అనుకూలంగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించింది. వరంగల్, కరీంనగర్ లోనూ ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజనీరింగ్ కాలేజీలు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. 

ఈ రెండు నగరాలు హైదరాబాద్​కు దగ్గర్లో ఉండటం, సిటీతో పోలిస్తే ఇక్కడ భూముల రేట్లు తక్కువగా ఉన్నట్లు నాస్కామ్ పేర్కొన్నది. అదేవిధంగా, ప్రభుత్వ పాలసీలు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఇటీవల ‘నాస్కామ్ జీసీసీ ప్లేబుక్ తెలంగాణాస్ బ్లూప్రింట్ ఫర్ గ్రోత్’ పేరిట రిలీజ్ చేసిన రిపోర్ట్ లో ఈ విషయాలు వెల్లడించింది.

ఐటీ హబ్ గా వరంగల్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని నాస్కామ్ తన రిపోర్టులో పేర్కొన్నది. హైదరాబాద్ తర్వాత ఎక్కువగా ఐటీ కంపెనీలను ఆకర్శిస్తున్న నగరం వరంగల్ అని వెల్లడించింది. వరంగల్ నగరంలో ఎల్​టీఐ మైండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రీ, జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాక్ట్, సైయెంట్ వంటి కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని రిపోర్టులో గుర్తు చేసింది. ఎన్ఐటీలాంటి విద్యాసంస్థలు వరంగల్ లో ఉండడం.. ఐటీ ఇండస్ట్రీ విస్తరణకు దోహదపడుతున్నట్లు తెలిపింది.

కరీంనగర్​లో ఇప్పటికే స్టార్టప్ కంపెనీలు

రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కరీంనగర్ లాంటి టైర్ -2 సిటీ.. ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డెవలప్ అవుతున్నదని రిపోర్టులో నాస్కామ్ పేర్కొన్నది. ‘‘ఇప్పటికే కరీంనగర్​లో స్టార్టప్​లు, ఐటీ సర్వీస్ ప్రొవైడర్లు పని చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ జీసీసీలు లేవు. 50కి పైగా సాంకేతిక సేవలు, కొన్ని టెక్ స్టార్టప్​లు ఉన్నాయి. 

జిల్లా నుంచి 15వేల మందికి పైగా టెక్, ఆర్ అండ్ డీ, బీపీఎం ప్రొఫెషనల్స్ ఉన్నరు. ఒక యూనివర్సిటీ, 20కి పైగా కాలేజీలున్నాయి. ఏటా 7 వేల నుంచి 9వేల మంది గ్రాడ్యుయేట్లు కాలేజీల నుంచి బయటికొస్తున్నరు.  వెయ్యి చదరపు అడుగులకు రూ.9 వేల నుంచి రూ.15వేల అద్దె ఉన్నది. ఇవన్నీ కరీంనగర్​కు అనుకూల అంశాలు. హైదరాబాద్​తో పోలిస్తే కరీంనగర్, వరంగల్​లో లివింగ్ కాస్ట్ కూడా తక్కువే’’అని నాస్కామ్ తన రిపోర్టులో తెలిపింది. 

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు అంటే?

ఇతర దేశాల్లోని టాలెంటెడ్ టెకీల సేవలు, సామర్థ్యాన్ని తక్కువ ఖర్చుతో ఉపయోగించుకుంటూ వ్యాపార వృద్ధికి తోడ్పడే కేంద్రాలే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ). ఇంటర్నేషనల్ బిజినెస్​లో జీసీసీల పాత్ర ఎంతో కీలకం. మన దేశంలో ప్రస్తుతం 1,700కుపైగా జీసీసీలు ఉన్నాయి. అందులో 355 జీసీసీలు హైదరాబాద్​లోనే ఉన్నాయి. మొదట్లో బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాల నిర్వహణకు ఏర్పాటైన జీసీసీలు.. క్రమంగా ఫ్రంట్ ఆఫీసులుగా మారాయి. ఒక్క జీసీసీ ఏర్పాటైతే.. 500 మంది నుంచి వెయ్యి మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.