తెలంగాణలో దర్శించాల్సిన ఆంజనేయస్వామి దేవాలయాలు ఇవే...

ఆంజనేయుడు మహా పరాక్రమవంతుడు, అపజయమే ఎరుగనివాడు. శత్రువులను సంహరించడంలోను భక్తులకు అభయమివ్వడంలోను ఆయన ఎంత మాత్రం వెనుకాడడు. ఆయన పేరు వింటేనే భూత.. ప్రేత.. పిశాచాలు కంటికి కనిపించనంత దూరం పారిపోతాయి. అంతటి శక్తిమంతుడైన ఆంజనేయుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు.  తెలంగాణలోని ప్రముఖ ఆంజనేయస్వామి దేవాలయాల విశేషాలను ఏప్రిల్​ 23  హనుమత్​జయంతి సందర్భంగా తెలుసుకుందాం. . . 

తాడ్​బండ్​.. ఆంజనేయస్వామి .. సికింద్రాబాద్​

శ్రీ తాడుబందు వీరాంజనేయ ఆలయం...  త్రేతాయుగంలోనే ఇక్కడ స్వామి స్వయంభువుగా అవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతున్నది. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు చెబుతారు.మొగలులు, రాజపుత్రులు, కుతుబ్ షాహీలు ఈ దేవాలయం కోసం కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెబుతుంటారు.19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేశాడు. అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయ సహకారాలతో, నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు. ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి. ఇక్కడి స్వామిని పూజించడం వల్ల ఆపదలు, అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు.భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు తాడ్‌బంద్ వరకు నిర్వహించే శోభాయాత్రతో ఘనంగా ముగుస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్‌మాన్ (చిన్నజయంతి), వైశాఖ బహుళ దశమినాడు (పెద్ద హను మాన్) జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది దీక్షాపరులు, భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. ముఖ్యంగా పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మూడురోజుల పాటు హోమం, యాగాదులు నిర్వహిస్తారు.

కర్మన్ ఘాట్ .. ఆంజనేయస్వామి.. హైదరాబాద్​

హైదరాబాద్ లో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి కర్మన్ ఘాట్ ఆలయం.క్రీస్తుశకం 1198లో ఈ ఆలయాన్ని గోల్కొండను పాలించే రెండవ ప్రతాప రుద్రుడు  కట్టించినట్లు ఆలయ చరిత్ర చెబుతున్నది. అతిపురాతన కట్టడంగా ఉన్న ఈ ఆలయ నిర్మాణం చూడగానే భక్తులలో భక్తిభావం పెరిగిపోతుంది.. సంతోష్ నగర్ సమీపంలోని కర్మన్ ఘాట్ వద్ద నాగార్జునసాగర్ రింగ్ రోడ్ కు సమీపంలో ఉంటుంది. ప్రధాన దైవం ధ్యాన ఆంజనేయుడిగా ఉండే హనుమంతుడు. ఆలయ సముదాయంలో రాముడు , శివుడు , సరస్వతి , దుర్గ , సంతోషిమాత , వేణుగోపాలుడు, జగన్నాథుడు కొలువై ఉన్నారు.కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతం లో వేటకు వచ్చి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అతనికి శ్రీ రామ్ అనే శబ్దం వినిపించగా అది ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకోవడానికి వెతుకుతుండగా పద్మాసనం వేసుకొని ,ధ్యాన ముద్రలో, దివ్యతేజో ప్రభతో వెలుగొందుతున్న స్వామి వారి విగ్రహాన్ని చూశాడు. అదేరోజు రాత్రి స్వామివారు ప్రతాప రుద్రుడికి కలలో కనిపించి దేవాలయం నిర్మించమని ఆదేశించడంతో వారి ఆదేశాల మేరకు దీన్ని నిర్మించినట్లు ఆలయ స్థలపురాణం చెబుతోంది. మొఘల్ సామ్రాజ్యాన్ని నలువైపులా విస్తరించేందుకు ఔరంగజేబు తన సైన్యాన్ని పంపాడు. ఈ సైన్యం ఆలయ ప్రహరీగోడ దగ్గరకు అడుగు కూడా పెట్టలేకపోయింది. ఔరంగజేబుకు ఈ విషయం తెలియడంతో దేవాలయాన్ని పడగొట్టేందుకు ఒక కాకితో కలిసి వెళ్లాడు. గుమ్మం దగ్గర ఉరుములా ఒక గర్జన వినపడింది. అతను భయంతో వణికిపోతుండగా కాకి ఔరంగజేబు చేతుల నుంచి జారిపోయింది.స్వర్గంలో "మందిర్ తోడ్నా హై తో కరో మాన్ ఘాట్ " (మీరు ఆలయాన్ని విధ్వంసం చేయాలనుకుంటే మీ హృదయాన్ని కఠినం చేసుకోండి) అని వినపడింది. అందుకే ఈ ప్రదేశానికి కర్-మాన్-ఘాట్ అనే పేరు వచ్చింది.హనుమాన్ జయంతిరోజు, దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రతిరోజు పరిమిత సంఖ్యలో భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు.

శ్రీ పంచముఖ ఆంజనేయ దేవాలయం ... మూ౦డామార్కెట్... సికింద్రాబాద్​

 హైదరాబాద్ మూండా మార్కెట్ వద్ద శ్రీ పంచముఖి ఆంజనేయ దేవాలయమున్నది. హనుమ.. అహి రావణుని నుంచి రామలక్ష్మణులను కాపాడటానికి వారిద్దరి చుట్టూ వాలంతో కోట కట్టిన గాధ కు ప్రతిరూపమే ఈ పంచముఖ ఆంజనేయస్వామి .హయగ్రీవ ,నారసింహ గరుడ ,వరాహ వానర రూపాలతో స్వామి దర్శనమిస్తాడు . ఇక్కడ హనుమత్​ జయంతి రోజున భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

శ్రీ పసన్న ఆంజనేయ దేవాలయం ... వెస్ట్ వెంకటాపురం.. ఆల్వాల్​.. సికింద్రాబాద్​ 


హైదరాబాద్ వెస్ట్ వెంకటాపురం ఆల్వాల్ లో శ్రీ ప్రసన్న ఆ౦జ నేయదేవాలయం ఉంది .దీనిదగ్గర రైలు మార్గం రాకముందు ఇదంతా అరణ్యప్రాంతం .వాగునీటిలో బయల్పడిన విగ్రహమే ఇక్కడి ప్రసన్నాంజనేయస్వామి . అక్కడేఅలాగే ఉంచి పూజలు చేసేవారు .1992లో ముఖమండపం కట్టారు .స్వామి దక్షిణాభిముఖుడు .గుడిముందు రావి చెట్టు ,లోపల వినాయకుడు ఉన్నారు.స్వామి సిందూరవర్ణ శోభిత౦ సకల హార భూషితుడుగా కనిపిస్తాడు.శివాలయ౦లొ శివలింగం, బాలాత్రిపుర సుందరీ ఉన్నారు.శ్రావణమాసం మూడవ శుక్రవారం లక్ష పుష్పాలతో అమ్మవారి విశేష పూజ కడు రమణీయం . నవగ్రహ మండపమూ ఉన్నది .

కొండగట్టు ఆంజనేయస్వామి... జగిత్యాల జిల్లా

తెలంగాణలో పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రాలలో కొండగట్టు ఒకటి.తెలంగాణ లోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ప్రసిద్ధి పొందింది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. జగిత్యాల నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది కొండగట్టు అంజన్న గుడి. కరీంనగర్ నుంచి 40 కిలోమీటర్ల జర్నీ. హైదరాబాద్ నుంచి అయితే దాదాపు 248 కిలోమీటర్ల దూరం. కొండగట్టు మీద ఉన్న ఆజనేయుని ఆలయం నిర్మణం 400 ఏళ్లకు క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఆంజనేయుడు స్వయం భూ గా వెలిశాడని.. 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి అంజనేయ స్వామి కనిపించినట్లు కథనం.. సంజీవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలోని నుంచి తప్పిపోయింది. ఆ అవును వెదుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టుకింద సేదదీరుతూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు హనుమంతుడు కలలో కనబడి.. తాను కోరంద పొదలో ఉన్నాను. తనకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించమని.. నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు.పూర్వము రామ రావణ యుద్ధము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చునపుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంతభాగము విరిగిపడింది. ఆ భాగాన్నే కొండగట్టుగా పిలుస్తున్నారు.

నారసింహస్వామి ముఖం (వక్త్రం) ఆంజనేయస్వామి ముఖం, రెండు ముఖాలతో హనుమంతుడు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం. కనుక కొండగట్టు ఆంజనేయస్వామి వారు స్వయంగా నారసింహవక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉన్నారు. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవులకాపరి సంజీవుడు నిర్మించాడు.

శ్రీ జోడీ ఆంజనేయ దేవాలయం -..లింగాపూర్.. కరీంనగర్​ జిల్లా

తెలంగాణా కరీంనగర్ జిల్లా ఎల్లెద్దుపేట మండలం లో సముద్రాల లింగాపూర్ లో ఉన్నశ్రీ జోడీ ఆంజనేయ దేవాలయం విశేషమైనది . ఇక్కడ స్వామి శ్రీ భక్తాంజనేయ ,శ్రీ వీరాంజనేయ అనే  రెండు రూపాలలో గర్భగుడిలోనే  దర్శనమిస్తాడు కనుక ఆ పేరొచ్చింది .ఈ ఆలయ నిర్మాణం జరిగి దాదాపు 60ఏళ్లు అయింది.  ఒక బెల్లం వ్యాపారి గౌరీ శెట్టి రాజేశం ఇక్కడికి వచ్చి రాత్రి అయినందున ఒక చెట్టుకింద పడుకోగా, కలలో హనుమ కనిపించి దగ్గరలోనే తన విగ్రహాలున్నాయని వెతికి గుడికట్టించమని కోరగా  వెతికితే రెండు విగ్రహాలు దొరకగా  చిన్న గుడికట్టి ప్రతిస్టించాడు .తర్వాతకాలం లో అతని కొడుకు గ్రామస్తులు భక్తులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కలిసి రాజగోపురం వగైరా నిర్మించి శోభ కూర్చారు .బయట రాజ గోపురం వద్ద 20అడుగుల శ్రీ ప్రసన్నాంజనేయ విగ్రహం ఉన్నది .శ్రీ రుద్ర లింగేశ్వర ,జ్ఞానసరస్వతి, తులసి అమ్మవార్లకు ఉపాలయాలు కట్టారు .పూజాదికాలు వైభవోపేతంగా జరుగుతాయి .

​ సారంగాపూర్​ .. ( నిజామాబాద్​ జిల్లా) ఆంజనేయస్వామి దేవాలయం: 

నిజామాబాద్​కి   8 కి మీ దూరం లో ఉన్న సారంగాపూర్ గ్రామం లో వెలసిన మహిమన్మితమైన ,శక్తివంతామైన ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని చత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు కట్టించారని స్థల పురాణం . విశాలమైన ఆవరణ లో ,ఎంతో ఆహాలదకరంగా,రమణీయంగా ఉంటుంది . ఈ మద్య కాలం లోనే దేవాలయ పరిసరాల్లో పార్కులు మొదలైన నిర్మాణాలు మొదలు చేయడం జరిగింది .ఈ ఆలయ నిర్మాణం ,ఆలయం లో ఉన్న ఉపాలయాలు కూడా చాల అద్బుతంగా నిర్మించడం జరిగింది . స్వామి వారు చాల మహిమన్మితులు ,కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం .ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ,శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది . ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సిన్చానీయమైన క్షేత్రం ఇది .

నల్లబండగూడెం, నల్గండ జిల్లా : పంచముఖ ఆంజనేయ స్వామి..

నల్లగొండ జిల్లాలోని నల్లబండగూడెం గ్రామంలో వున్న నల్లబండ పైన లింగమంతుల (శివుని) ఆలయము ఉంది. ప్రతి 2 సంవత్సరములకి ఒకసారి లింగమంతుల స్వామి వారి జాతర వైభవముగా జరుగును. అదే బండ పైన 1993–-94 సంవత్సరంలో 24 అడుగుల ఎత్తైన పంచముఖ ఆంజనేయుల స్యామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.  ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు.. హనుమత్​ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.  ఇక్కడ స్వామిని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం.  పంచముఖ ఆంజనేయస్వామిని పూజించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలని పండితులు చెబుతుంటారు.  

శ్రీ పంచముఖ ఆంజనేయ దేవాలయం –జమ్మికుంట.. కరీంనగర్​ జిల్లా

తెలంగాణా కరీం నగర్ జిల్లా జమ్మికుంటలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం త్రేతాయుగం తో సంబంధమున్నది .మహి రావణుని...  హనుమంతుడు పాతాళంలో చంపి బయటికొచ్చి విశ్రమించిన చోటు అని స్థానిక కధనం . మహి ప్రాణాలు అయిదు తుమ్మెదలలో ఉన్నాయని వాటిని ఒకేసారి చంపితేనే వాడు చస్తాడని తండ్రి వాయు దేవుడు చెప్పగా పంచముఖాలతో వాటిని ఒకేసారి భక్షించి మహిరావణుని.. హనుమంతుడు  కూల్చాడని పురాణాలు చెబుతున్నాయి.  

శ్రీ అభయ ఆంజనేయ దేవాలయం .. గోదావరిఖని..కరీంనగర్​ జిల్లా

తెలంగాణా కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఫర్టిలైజర్ సిటీలో శ్రీ అభయాంజనేయ దేవాలయం ఆప్రాంతానికి రక్ష అని భావిస్తారు .40ఏళ్ళక్రితం భక్తులు నిర్మించిన ఆలయం  ఇది.  ఒకానొక రోజు  గుడి తలుపులు పూజారి  తెరవడంతోనే ఆ స్వామి పద్మాసంలో ఉండి తపస్సు చేసుకున్నాడని... ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు ఆ స్వామి అలా వచ్చాడని చెబుతుంటారు.  ప్రతి ఏడాది హనుమత్​ జయంతి ఉత్సవాలను ఈ ప్రాంత ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.  

శ్రీ హనుమ దేవాలయం ...భువనగిరి.. యాదాద్రి భువనగిరి జిల్లా 

తెలంగాణా బోన్ గిరి అని పిలువబడే భువనగిరి లో కొండపై విక్రమాదిత్యునికాలం నాటి కోట ఉన్నది. కస్టపడి పైకి ఎక్కితే  అందమే ఆనందం . అక్కడ శ్రీ హనుమాన్ దేవాలయం ప్రాచీనమైనది .అక్కడే చిన్న చిన్న కొలనులు,. తమలపాకు తోటలు  ఎంతో అందంగా కనపడతాయి.  ఇక్కడ స్వామికి ఆకు పూజ నిర్వహిస్తే భక్తుల కోర్కెలు తీరుతాయని విశ్వాసం. . . 

చింతలకుంట ఆంజనేయస్వామి... పాతపల్లి గ్రామం... వనపర్తి జిల్లా...

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామ సమీపంలో వెలసిన  చింతలకుంట ఆంజనేయస్వామి ఈ పేరు ఏవిధంగా వచ్చిందంటే గుడి చుట్టూ చింతచెట్లు,పక్కనే ఓ నీటి కుంట కూడా వుండేదని అందుకే ఈ స్వామికి “చింతల కుంట ఆంజనేయస్వామి” అనే పేరు వచ్చిందని ఆలయ పూజారి చెబుతున్నారు.ఈ ప్రాంత ప్రజల మొక్కులను తీర్చే అరాద్య దైవం కొరిన కోర్కెలను తీర్చి కొంగు బంగారం చేసే దేవుడు ఈ ఆంజనేయస్వామి. ఈ స్వామికి కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారు. .ఈ స్వామికి ప్రత్యేకత ఏమిటంటే గా మాంసాహారంతో పూజలు చేస్తున్నారు.మొదట్లో  ఆంజనేయస్వామికి కోళ్లు,గొర్రెలు,మేకలు బలిచ్చి మాంసంతో పూజలు చేయడం మంచి పద్దతి కాదని చాలామంది చెప్పారు. కానీ అది రాను రాను అనవాయితీగా కొనసాగుతుందని వారంలో సోమ,శని వారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులను తీర్చుకుంటున్నారని,అంతే కాకుండా సంక్రాంతి, ఉగాది,దసరా పండుగలకు భక్తులు ఇసుకేస్తే రాలనంతగా వస్తారని, భక్తుల సందడి రోజు రోజుకు పెరుగుతూ వస్తుందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ప్రాంత భక్తులే కాకుండా ఇతర జిల్లాల, రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులను తీర్చుకుంటున్నారని మొదటి సారి వచ్చే భక్తులు స్వామి వద్దకు వచ్చి తమ కోర్కెలను కోరుకుని వెళ్ళాక తమకు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే బందు,మిత్రులతో వచ్చి స్వామికి కోళ్లు,గొర్రెలు,మేకలను తెచ్చి బలిచ్చి వంటలు చేసుకుని కల్లుతో గుడి చుట్టూ కుటుంబ సభ్యులతో ప్రదక్షణలు చేసి స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులు  బోజనాలు చేసుకుని తిరిగి తమ ప్రాంతాలకు వెళ్తారు.

శ్రీ జ౦బి హనుమాన్ దేవాలయం ...ఆర్మూర్... నిజామాబాద్​ జిల్లా

తెలంగాణాలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో శ్రీ జ౦బి ఆ౦జ నేయ దేవాలయం ప్రసిద్ధమైనది .సిద్దులగుట్ట అనే చిన్న కొండపై ఈ ఆలయముంది .ఒకప్పుడు కొందరు సిద్ధులు ఇక్కడ తపస్సు చేయటం వలన ఆ పేరొచ్చింది .గర్భాలయం లో సింధూర పూతతో స్వామి దర్శనమిస్తాడు . ఇక్కడ శివ ,విఘ్నేశ్వర విగ్రహాలూ ఉన్నాయి . దర్శనమాత్ర తో సకల కోరికలు తీర్చే ,భయాలు నివారించే మహిమాన్వితుడు స్వామి .సినీ, రాజకీయ ప్రముఖులందరూ జంబి హనుమాన్ ను దర్శించి విజయం సాధిస్తారు .

వ్యాసమహర్షి ప్రతిష్టిత ఆంజనేయ దేవాలయం ... చిన్న రాజమూరు.. మహబూబ్​ నగర్​ జిల్లా

తెలంగాణా పాలమూరు(మహబూబ్ నగర్ ) జిల్లా చిన్నరాజమూరు గ్రామం లో 400ఏళ్ళనాటి పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది .దీన్ని చిన్నరాజమూరు ఆలయం అంటారు .ఇక్కడి స్వామి విగ్రహాన్ని  వ్యాస మహర్షి ప్రతిష్టిం చాడని ప్రతీతి .తుంగభద్రా నదీ తీరాన వడ్డేపల్లి మండలం రాజోలి కి దగ్గర గా ఉంటుంది . కాలక్రమాన విగ్రహం మట్టిలో కలిసిపోయింది .ఒక రోజు ఒక రైతు  నాగలి దున్నుతుంటే విగ్రహం బయట పడింది .ఆ రాత్రి స్వామి అతనికి కలలో కనిపించి విగ్రహాన్ని బండిమీద ఉత్తర దిశ వైపుకు తీసుకు వెళ్ళమని చెప్పాడు.ఇక్కడికి బండీరాగానే చక్రం ఇరుసు విరిగి బండి కదలలేదు .అప్పుడు ఇక్కడే ప్రతిష్టించారు .మార్గశిరమాసం లో స్వామికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు . మండల కేంద్రం దేవకద్ర నుంచి 10కిలోమీటర్లు .నారాయణపేట నుంచి చేరుకోవచ్చు .