కుండపోత వాన .. ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తం

  • నిండి అలుగు పారుతున్న చెరువులు, కుంటలు
  • సింగూర్ కు పెరుగుతున్న వరద
  • నేడు విద్యా సంస్థలకు సెలవు

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేని వాన కురిసింది. పలుచోట్ల కుండపోత వర్షం పడింది. మెదక్ మండలం పాతూర్ లో అత్యధికంగా 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలో 396 చెరువులు పూర్తిగా నిండాయి. అనేక చెరువులు అలుగు పారుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలుచోట్ల రాకపోకలు స్తంభించి జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. 

కౌడిపల్లి పెద్ద చెరువులోకి పెద్ద ఎత్తున నీరు చేరగా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చెరువు వద్దకు చేరుకొని పరిశీలించారు. జాజి తండా- రాజిపేటకు మధ్య ఉన్న వాగు ప్రవాహంతో రాకపోకలు బందయ్యాయి. లింగంపల్లి, అందుగులపల్లి వెళ్లే రోడ్డు  మీద వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాల్లో భారీ వర్షానికి పొలాలు నీట మునిగాయి. రామాయంపేట మండలంలోని డి.ధర్మారం పరిధి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ రూట్​లో ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్ల చెట్లు వేశారు. లక్ష్మాపూ ర్ శివారులో పుష్పాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి డి.ధర్మారంలో వేపచెట్టు కూలి సింగిల్​ ఫేజ్​ ట్రాన్స్​ ఫార్మర్​ మీద పడిది. 

సిద్దిపేటలో.. 

జిల్లా వ్యాప్తంగా ఆదివారం వర్షం ముంచెత్తింది. 214.6 మిల్లీ మీటర్ల వర్షం కురియగా అత్యధికంగా  మిరుదొడ్డిలో 152.3, సిద్దిపేట రూరల్ లో 139.3, నారాయణరావుపేట లో138.5,  కొండపాక లో 116.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించి డివిజన్ , మున్సిపల్ ఆఫీసుల్లో ప్రత్యేంగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు చోట్ల 30 కి పైగా  పాత ఇండ్లు కూలిపోగా, భారీ వృక్షాలు నేల కూలాయి.

 రామునిపట్ల గోనెపల్లి వాగు , బస్వాపూర్ వద్ద మోయ తుమ్మెద వాగు , తాడూరు చిట్యాల మధ్య వాగు , హుస్నాబాద్ కొత్త కొండ మధ్య వాగు, బెజ్జంకి ముత్తన్న పేట మధ్య వాగులు పొంగి పొర్లడంతో పోలీసులు రోడ్లను బ్లాక్ చేసి రాకపోకలు నిలిపివేశారు. మోయ తుమ్మెద వాగు  వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున బస్వాపూర్ గ్రామస్తులు  అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు. హుస్నాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్డు, బస్టాండ్ ఆవరణ మొత్తం వరద నీటితో నిండిపోయింది. పలు గ్రామాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. 

ALSO READ : మరో మూడు రోజులు జోరువాన జలదిగ్బంధంలో దక్షిణ తెలంగాణ

సంగారెడ్డిలో..

సంగారెడ్డి జిల్లాలో శనివారం నుంచి ఎడతెరపి లేని వాన కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు వర ప్రదాయిని అయిన సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 3.403 టీఎంసీల వరదనీరు చేగోడీ ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. కాగా సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 17.051 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి వినాయక్ సాగర్, మల్కాపూర్ చెరువు, సదాశివపేట గంగకత్వ వాగు, నల్లవాగు, నారింజ ప్రాజెక్టు, హంగిర్గ వాగు, వంగ్దల్ వాగు, పెద్దాపూర్ వాగు, తంగెడపల్లి వాగులు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. అలాగే పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన దారులు వరద నీటితో కొట్టుకుపోయాయి. నారాయణ్​ఖేడ్​ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్​వెళ్తుండగా ఆందోల్​ మండలంలోని కిచ్చన్నపల్లి గేట్​ సమీపంలో చెట్టు కొమ్మ విరిగి పడడంతో బస్సు గుంతలోకి దూసుకుపోయింది. కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. భారీ వర్షాలకు అక్కడక్కడ చెట్లు నేలకొరకగా పాక్షికంగా ఇండ్లు దెబ్బతిన్నాయి.