రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం : దామోదర రాజనర్సింహ

జోగిపేట, వెలుగు : రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసే పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. జోగిపేటలో వ్యవసాయ మార్కెట్​కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలో 211 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడంలో మార్కెట్‌‌‌‌ కమిటీలు సహకరించాలని సూచించారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించాలన్నారు. 

జోగిపేటలో 150 పడకల హాస్పిటల్‌‌‌‌తో పాటు నర్సింగ్‌‌‌‌ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వట్‌‌‌‌పల్లి మండల కేంద్రంలో 30 పడకల హాస్పిటల్‌‌‌‌ పనులు నడుస్తున్నాయని, సింగూర్‌‌‌‌ కాల్వల సిమెంట్‌‌‌‌ లైనింగ్‌‌‌‌ కోసం రూ.125 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం జోగిపేట మార్కెట్​ కమిటీ చైర్మన్‌‌‌‌గా జగన్మోహన్​రెడ్డి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా సత్యనారాయణ, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ షెట్కార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.