ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్య, వైద్యాలకు పెద్దపీట : దామోదర రాజనర్సింహా

  • ఏడాది ప్రజాపాలనపై రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు
  • మంత్రులు దామోదర రాజనర్సింహా, శ్రీధర్‌‌బాబు 
  • భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జయశంకర్‌‌ భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్‌‌/ రేగొండ, వెలుగు: విద్య, వైద్యం, సంక్షేమం, మహిళా సాధికారతకు రేవంత్‌‌ సర్కార్​ ప్రాధాన్యం ఇస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఐటీ మినిష్టర్‌‌ శ్రీధర్‌‌బాబు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లాలో రూ.130 కోట్లతో మెడికల్‌‌ కళాశాల నూతన బిల్డింగ్‌‌ నిర్మాణం, మరో రూ.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. గణపురం మండలం గాంధీనగర్‌‌ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రులు పాల్గొన్నారు. అనంతరం హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ గతంలో వైఎస్‌‌ రాజశేఖర్‌‌ రెడ్డి ప్రభుత్వంలో పావలా వడ్డీ, వడ్డీలేని రుణాలు వంటి పథకాలతో డ్వాక్రా మహిళలకు ఎంతో లాభం కలిగిందన్నారు. 108, 104, ఆరోగ్య శ్రీ పథకాలతో ఎందరో పేదలు తమ ప్రాణాలు కాపాడుకున్నారన్నారు.

ఇప్పటికీ వైఎస్సార్‌‌ చేసిన సేవలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. ఆ తర్వాత తొమ్మిదేళ్ల కుటుంబ, నియంత, రాక్షస పాలనతో ప్రజలు నరకం చవిచూశారన్నారు. ప్రజా పాలన ఏర్పడిన ఏడాదిలోపే ప్రజలకు ఎన్నో పథకాలను అమలు చేసి చూపించామన్నారు. ఒక్క ఏడాదిలోనే 55 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లోనే 8 వేల ఉద్యోగాలిచ్చామన్నారు. ఇంకా 8 వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని కూడా ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. 40 శాతం డైట్‌‌, వంద శాతం కాస్మోటిక్‌‌ ఛార్జీలు పెంచి గురుకుల విద్యార్థులకు అండగా నిలుస్తున్నామన్నారు.  

ఒక్క ఎకరాన్ని బీడుగా ఉంచను: మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌‌బాబు 

భూపాలపల్లి జిల్లాలో ఒక్క ఎకరాన్ని కూడా బీడుగా ఉంచమని ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌‌బాబు అన్నారు. గత ప్రభుత్వం ఈ జిల్లాలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ కట్టి ఇక్కడి నీళ్లను వేరే ప్రాంతానికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ జిల్లాలో మూడు బ్యారేజీలు కట్టి కూడా ఒక్క ఎకరానికి నీళ్లివ్వలేదని తెలిపారు. డీబీఎం 38, దేవాదుల, చిన్న కాళేశ్వరం స్కీమ్‌‌ల ద్వారా జిల్లాలకు సాగునీళ్లను తీసుకొచ్చి ఇక్కడి పంట పొలాలను గోదావరి నీళ్లతో తడుపుతామని చెప్పారు.

జిల్లాలో ఇండస్ట్రీయల్‌‌ పార్క్‌‌ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశామన్నారు. భూపాలపల్లి టౌన్‌‌లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బైపాస్‌‌ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలో మహిళల కోసం మిని ఇండస్ట్రీయల్‌‌ పార్క్‌‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్‌‌ రాహుల్‌‌ శర్మ, ఎస్పీ కిరణ్‌‌ ఖరే, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. 

వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే సహించం 

ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తే సహించేది లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. భూపాలపల్లిలో నిర్వహించిన సమీక్షలో ఆయన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి మాట్లాడుతూ ఈ ప్రాంతం పరిశ్రమల ప్రాంతమని, మంథని, పెద్దపల్లితోపాటు సమీప రాష్ట్రాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వైద్య సేవలకు వస్తుంటారని మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు.

జిల్లాకు 2 ప్రాథమిక, 2 కమ్యూనిటీ ఆస్పత్రులను మంజూరు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఎమ్మారై సేవలు అందుబాటులో తేవాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ శాసన సభ్యులు కోరిన విధంగా ప్రాథమిక, కమ్యూనిటీ  కేంద్రాలు, అంబులెన్స్ సేవలను మంజూరు చేస్తామని తెలిపారు. చిట్యాల ఆస్పత్రిలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని సూచించారు. సమీక్షలో డీఎంహెచ్​వో మధుసూదన్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ నవీన్ తదితరులున్నారు.