పేదలకు అందుబాటులో విద్య, వైద్యం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

  • మార్కెట్ల అభివృద్ధికి నిధులు మంజూరు
  • పత్తి గోదాం నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు

రాయికోడ్, వెలుగు: బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు విద్య, మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం  కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.  బుధవారం  రాయికోడ్  మండలం మునిపల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారానికి ముఖ్య  అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్థానిక ముమ్మా దేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా  మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాయికోడ్ లో మార్కెట్ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతంలో  రూ. 3  కోట్లతో ఐదున్నర మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న పత్తి గోదాంలో నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు.  మార్కెట్ అభివృద్ధి కోసం పాలకవర్గ సభ్యులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.  కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి  గోదాములు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 మునిపల్లి మండలం కంకోల్ లో గోదాముల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో సింగూర్ కాలువల మరమ్మతుల కోసం రూ. 170 కోట్లు మంజూరు చేస్తామన్నారు.  రెండున్నర  కోట్ల రూపాయలతో బోరంచ లిప్ట్ నిధులతో పనులు చేపట్టేందుకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.  బొగ్గులంపల్లి ఎత్తిపోతలకు కోటి రూపాయలు మంజూరు  చేస్తున్నట్లు ప్రకటించారు.  

కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్  అంజయ్య,మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి వినయ్ కుమార్ నాయకులు సిద్దన్నపాటి ల్ మల్లికార్జున పాటిల్, బసవరాజ్ పటేల్ , హనుమంతరావు పాటిల్, రాంరెడ్డి,శేషారెడ్డి సురేందర్ గౌడ్ సతీష్ కుమార్ .ఎసయ్య,బాలాజీ నర్సింలు,ప్రభాకర్, కేదారినాథ్ పాటిల్, ఆందోల్ నియోజకవర్గం లోని  మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు