Be Alert: మీకు స్మార్ట్​ టీవీ ఉందా.. అయితే హ్యాకర్లు మోసం చేసే అవకాశం ఉంది..

హ్యాకర్లు  ప్రజల్ని మోసగించేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదు. మారుతున్న పరిణామాలు.. స్మార్ట్​ యుగంతో వారి పని మరీ ఈజీ అయింది.  ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో స్మార్ట్​ టీవీ ఉంటుంది.  ప్రజల డిమాండ్​ కు తగ్గట్టుగా కంపెనీలు వివిధ రకాల ఫ్యూచర్​ లతో టీవీలను తయారు చేసి మార్కెట్​ లో రిలీజ్​ చేస్తున్నారు.  ఈ రోజుల్లో ఎక్కువగా స్మార్ట్ టీవీనే కొనుక్కుంటున్నారు యూజర్లు. కొత్తగా అమ్ముడవుతున్న వాటిలో స్మార్ట్ టీవీల వాటానే ఎక్కువ. ఇంటర్నెట్ తోనో , మొబైల్​ తోనో  కనెక్ట్ చేసుకునే అవకాశం ఉండటం, కేబుల్​ తో  పని లేకుండా వై-ఫై ద్వారా ‘నెటిక్స్, అమెజాన్' వంటి స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా వీడియోలు చూసే అవకాశం ఉండటం వంటి అనేక కారణాలతో అందరూ స్మార్ట్ టీవీలవైపే మొగ్గు చూపుతున్నారు. అయితే స్మార్ట్ టీవీలు హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వీటివల్ల మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లొచ్చు. టీవీల ద్వారా మిమ్మల్ని హ్యాకర్లు చూస్తూనే ఉంటారు.

స్మార్ట్ టీవీ అనే కాదు.. ఇంటర్నెట్ తో కనెక్టయ్యే ఎలాంటి డివైజ్ అయినా హ్యాకింగ్​కు గురయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ టీవీలు ఇంటర్నెట్ కేబుల్, మొబైల్ ఫోన్, రౌటర్ ద్వారా వై-ఫైతో కనెక్ట్​ అవుతాయి.  టీవీ, పర్సనల్ కంప్యూటర్, ల్యాప్టాప్ వంటి ఏ డివైజ్ లోకి హ్యాకర్ చొరబడ్డా, ఒకదాని నుంచి మరో దానికి ఈజీగా కనెక్టవుతారు. అందువల్ల మీకు సంబంధించిన మొత్తం ఆన్ లైన్ యాక్టివిటీస్, డేటా వంటివి హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి నుంచి రక్షించుకోవచ్చు. 

 కొన్ని స్మార్ట్ టీవీలకు కెమెరా కూడా ఉంటుంది. వాటి ద్వారా ఆన్​ లైన్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే స్మార్ట్ టీవీ హ్యాకింగ్ కు గురైతే, కెమెరాను కూడా హ్యాకర్లు యాక్సెస్ చేయగలుగుతారు. మీకు తెలియకుండా కెమెరాను ఆన్ చేసి దాని ఎదురుగా ఉండే ప్రతి దృశ్యాన్ని రికార్డు చేయగలరు. ఇది యూజర్లకు సంబంధించిన ప్రైవసీని దెబ్బతీస్తుంది. గదిలో లేదా హాల్లోని యాక్టివిటీస్ అన్నింటినీ హ్యాకర్లు గమనిస్తుంటారు. ఒకవేళ మీ స్మార్ట్ టీవీకి కెమెరా ఉంటే దానిపై యాంటీ కెమెరా క్లిప్స్ పెట్టి ఉంచండి. లేదా చిన్న టేప్​ లాంటివి అతికించి కెమెరా క్లోజ్ చేయండి.

 స్మార్ట్ టీవీలు సాఫ్ట్​ వేర్ తో రూపొందుతాయి. సాఫ్ట్​ వేర్ లోని లోపాల ఆధారంగా, ఇంటర్నెట్ ద్వారా వైరస్ చొప్పించి టీవీలను హ్యాక్ చేస్తారు. టీవీ హ్యాకింగ్ కు గురి కాకూడదనుకుంటే ఎప్పటికప్పుడు సాఫ్ట్​ వేర్ అప్డేట్ చేసుకోవాలి. అలాగే టీవీలో వాడే ‘యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో'తోపాటు అన్ని యాప్ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి.  ఇతరుల నుంచి తీసుకున్న యూఎస్ బీ  స్టిక్స్, పెన్ డ్రైవ్​ లాంటివి కనెక్ట్ చేయకూడదు. టీవీ స్క్రీన్​ పై  కనిపించే ప్రతి మెసేజ్​ ను ఓపెన్ చేయకూడదు. సెట్టింగ్స్ లోకి వెళ్లి 'స్మార్ట్ సెక్యూరిటీ' ఆన్ చేసుకోవాలి.