ఉగ్రవాదులకు బెంగాల్ సురక్షిత స్వర్గధామమన్న బీజేపీ నేతలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. బెంగాల్లో భద్రత లేదని కాషాయ నేతలు ప్రచారం చేస్తున్నారని, మరి రాజస్ధాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ సురక్షితమా అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. బెంగాల్లోని కూచ్బెహర్లో శుక్రవారం జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జల్పాయిగురిలో ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించిందని, వారికి కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేసిందని మమతా ప్రశ్నించారు.
అవినీతి మరకలు లేని అభ్యర్ధిని బరిలో నిలిపితే కాషాయ పార్టీ అభ్యర్ధి రాక్షసుడని ఆరోపిస్తుందని బీజేపీ అభ్యర్ధి బాగోతాలపై తన వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని, వాటిని బయటపెట్టగలనని మమతా బెనర్జీ హెచ్చరించారు. బెంగాల్ అభివృద్ధికి కట్టుబడిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
