- కొత్త ఇండస్ట్రీస్, ప్రాజెక్టులన్నీ నగరం నుంచి 150 కిలోమీటర్ల రేంజ్ లో ఏర్పాటుకు ప్లాన్
- ఇటు వరంగల్, అటు మహబూబ్‌నగర్, సంగారెడ్డి దాకా పర్మిషన్లు ఇవ్వాలని నిర్ణయం
- ట్రిపుల్ఆర్ నుంచి రేడియల్ రోడ్లతో కనెక్టివిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మల్టీ సిటీస్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తున్నది. హైదరాబాద్ నగరంలోకి ఇతర జిల్లాల నుంచి వలసలు పెరుగుతుండటంతో ఇండస్ట్రీల ఏర్పాటు, ఇతర జిల్లాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ డెవలప్మెంట్ పెంచాలని చూస్తున్నది. ఫలితంగా వచ్చే రెండేండ్లలో హైదరాబాద్‌ను బర్డెన్ ఫ్రీ సిటీగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం రెండు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
వివిధ దేశాలు అక్కడ రాష్ట్రాల్లో క్యాపిటల్ సిటీలను ఏ రకంగా బర్డెన్ ఫ్రీ చేసుకున్నాయో స్టడీ చేస్తున్నది. అమెరికాతోపాటు దక్షిణ కొరియా అవలంబించిన విధానాలను తెలంగాణలోనూ అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డెవలప్ మెంట్ ఫోకస్ అవ్వడంతోపాటు రాజధాని నగరంపై బర్డెన్ తగ్గనున్నది. అందులో భాగంగానే ట్రాన్స్ పోర్ట్ సౌకర్యాలు పెంచడం, రాష్ట్రానికి వచ్చే కొత్త ఇండస్ట్రీస్, ప్రభుత్వ క్యాపిటల్ డెవలప్మెంట్ ను అన్ని ప్రాంతాల్లోకి విస్తరించేలా ప్రపోజల్స్తయారుచేస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్), ఫోర్త్ సిటీ వస్తుండటంతో నగరం నుంచి 150 కిలో మీటర్ల రేంజ్ వరకు డెవలప్ మెంట్ యాక్టివిటీస్ పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. వరంగల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి అవతలి వరకు డెవలప్ మెంట్ ను విస్తరించాలని ప్లాన్ చేస్తున్నది.
సౌత్ కొరియా.. యూఎస్ సిటీలపై అధ్యయనం
సౌత్ కొరియా, యూఎస్ లో ఒకటే నగరం కాకుండా.. వివిధ సిటీలను ఎలా అభివృద్ధి చేసుకున్నారనే దానిపై అధికారులు ప్రిలిమినరీ స్టడీ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. సౌత్ కొరియా.. రాజధాని సియోల్ తో పాటు ఇంచెగాన్, బూసాన్, సెజాంగ్ వంటి సిటీలను డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నది. దీంతో సియోల్పై బర్డెన్ తగ్గుతూ వస్తున్నది. ఇక యూఎస్‌లో ఎక్కువ సంఖ్యలో నగరాలు డెవలప్ అయ్యాయి. న్యూయార్క్ సిటీ, లాస్ ఏంజిల్స్, చికాగో, హ్యూస్టన్, ఫోనిక్స్, ఫిలాడెల్ఫియా, శాన్‌ఆంటోనియా, డల్లాస్, ఆస్టిన్, బోస్టన్, అట్లాంటా ఇలా పదుల సంఖ్యలో సిటీలు అభివృద్ధికి కేంద్రాలుగా ఉన్నాయి.
ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి సిటీలను తీసుకురావాలని ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిపెట్టింది. అందులో భాగంగానే వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట లేదా నల్గొండ జిల్లాలను డెస్టినేషన్ లుగా తీసుకొని ప్లాన్ చేస్తున్నది. ఈ సిటీల్లో ఎక్కువ సంఖ్యలో ఇండస్ట్రీలు ఇన్వెస్ట్ చేసేలా ప్రొత్సాహించాలనుకుంటున్నది. హైదరాబాద్ అయితే ఒక సబ్సిడీ.. జిల్లాలకు వెళ్తే ఇంకో రకమైన సబ్సిడీలను ప్రభుత్వం నుంచి ఇవ్వాలని ప్రతిపాదించనున్నది.
ఇండస్ట్రీల ఏర్పాటుకు అవసరమైన భూములను తక్కువకే కేటాయించాలని చూస్తున్నది. ఇక ప్రభుత్వం తరఫు నుంచి అవసరమైన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అభివృద్ధి కూడా ఆయా జిల్లాల్లో వీలైనంత ఎక్కువగా చేసేలా ప్రతి ఏటా బడ్జెట్లో ప్రత్యేక నిధుల కేటాయింపునకు ప్రాధాన్యత ఇవ్వనున్నది. అదే సమయంలో ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని మెరుగుపర్చనున్నది. ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డుతో నగరం నుంచి 150 కిలో మీటర్లు ఆపైన వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో చేరుకునేలా రేడియల్ రోడ్లు కూడా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంకో మూడు, నాలుగు ఎయిర్‌పోర్ట్‌లను కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు నిధులు రిలీజ్ చేసింది. జక్రాన్‌పల్లి, కొత్తగూడెంతో, పెద్దపల్లి జిల్లాల్లోనూ మినీ ఎయిర్ పోర్ట్‌లకు ప్లాన్ చేస్తున్నది. వరంగల్ సిటీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీని విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నది. పెట్టుబడులు, రవాణా, ఎకో ప్రెండ్లీ విధానాలతో ఇతర జిల్లాలను అభివృద్ధి చేయడమే కాకుండా ఆ ప్రాంతాల్లోనే ఉద్యోగ, ఉపాధి ఎక్కువగా కల్పించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఫలితంగా రాజధాని సిటీపై బర్డెన్ తగ్గనున్నది.