సర్కారు భూములకు పట్టాలు..కబ్జాలో గైరాన్​, భూదాన్​ భూములు

  • కబ్జాలో గైరాన్​, భూదాన్​ భూములు
  • భూత్పూర్​ మండలంలో  వందల ఎకరాల ఆక్రమణ 
  • ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి పట్టాలు పొందిన లీడర్లు, రియల్​ వ్యాపారులు
  • ప్రభుత్వం మారడంతో ప్లాట్లుగా చేసిన అమ్ముకునేందుకు ప్రయత్నాలు

మహబూబ్​నగర్​/అచ్చంపేట, వెలుగు : సర్కారు, భూదాన్​ భూములు పట్టాలుగా మారిపోతున్నాయి. వందల కోట్ల విలువ చేసే ఈ భూములను గత ప్రభుత్వంలోని కొందరు లీడర్లు, రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి వారి పేర్ల మీద పట్టాలు చేయించుకున్నారు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడా భూములను ప్లాట్లుగా చేసి అమాయకులకు కట్టబెట్టేందుకు   ప్రయత్నాలు చేస్తున్నారు. 

రూ.30 కోట్ల భూమికి ఎసరు... 

నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సర్వే నంబర్​ 293లో 4.32 ఎకరాల గైరాన్​ భూమి ఉంది. 1955 ఖాస్రా, పహానిలో కూడా ఇవే వివరాలు ఉన్నాయి.   40 ఏండ్ల కిందట ఈ భూమిని రిటైర్డ్​ ఆర్మీ ఆఫీసర్​కు రెవెన్యూ ఆఫీసర్లు కేటాయించారు. కానీ, ఈయన 1995లో మృతి చెందాడు. అప్పటి నుంచి ఈ భూమి ఖాళీగా ఉంది. 2009లో అచ్చంపేటకు చెందిన కొందరు పేదలు ఈ స్థలంలో గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేయగా.. రెవెన్యూ, మున్సిపల్​, పోలీసు ఆఫీసర్లు అడ్డుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని, ఇక్కడికి వస్తే  చర్యలుంటామని హెచ్చరించడంతో వారు వెనుదిరిగారు.

 అనంతరం ఈ భూమి మేజర్​ గ్రామ పంచాయతీదని బోర్డు ఏర్పాటు చేసి డంపింగ్​ యార్డుగా ఉపయోగించారు. కాని 2011లో ఈ భూమిపై అచ్చంపేటకు చెందిన కొందరు లీడర్ల​ కన్ను పడింది. ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించారు.  అనంతరం రెవెన్యూ ఆఫీసర్లను మచ్చిక చేసుకొని ఆ భూమికి 15 మంది పేర్ల మీద పట్టాలు తెచ్చుకున్నారు. అయితే పదేండ్లుగా సైలెన్స్​గా ఉన్న ఆ లీడర్లు నెల రోజుల నుంచి ఆ భూమిని ప్లాట్లుగా చేసి అమ్మేందుకు చదును చేస్తుండటంతో విషయం బయట పడింది. 

భూత్పూర్​లో భూదాన్​ భూములు..

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్​ మండలంలో దాదాపు 800 ఎకరాల్లో భూదాన్​ భూములున్నాయి. ఎక్కువగా నేషనల్​ హైవే-44ను ఆనుకొని ఈ భూములు ఉండగా.. వీటి విలువ ఎకరాకు రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల  వరకు పలుకుతున్నాయి. దీంతో  కొందరు లీడర్లు ఈ భూములను గాయబ్​ చేశారు. ఏపీ భూదాన్​ బోర్డు రికార్డులను బేస్​ చేసుకొని.. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు ఉన్నతాధికారుల నుంచి ఈ భూములకు ఎన్​వోసీలు తెచ్చుకున్నారు.

 అనంతరం ఫేక్​ డాక్యుమెంట్లకు ఎన్​వోసీలను అటాచ్​​ చేసి పెద్ద ఎత్తున భూదాన్​ భూములను ఆ లీడర్లు వారి పేర్ల మీద పట్టాలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ భూముల్లో రియల్​ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేశారు. గజం స్థలం రూ.8,500 నుంచి రూ.14 వేల చొప్పున అమ్ముతున్నారు. ఈ విషయం ఇటీవల బయట పడటంతో ఆఫీసర్లు భూత్పూర్​ మండలంలో ఉన్న భూదాన్​ భూములను సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

రెవెన్యూ డిపార్ట్​మెంట్​ సహకారంతోనే..

ధరణి పోర్టల్​ రావడంతో పెద్ద ఎత్తున భూ అక్రమాలు పెరిగాయి. ఈ పోర్టల్​లోని నిషేధిత జాబితాలో భూదాన్​ భూములకు సంబంధించిన పలు సర్వే నంబర్లు అందుబాటులో లేవు. దీన్ని ఆధారం చేసుకున్న గత ప్రభుత్వంలోని కొందరు లీడర్లు పెద్ద మొత్తంలో ఈ భూములను మాయం చేశారు.

ఇందుకు రెవెన్యూ డిపార్ట్​మెంట్​లోని కొందరు ఆఫీసర్లు కూడా సహకారం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు సహకారం అందించినందుకు గాను సదరు లీడర్లు ఈ ఆఫీసర్లు లక్షల రూపాయల్లో డబ్బులు ముట్టజెప్పారనే విమర్శలున్నాయి. ఎలాంటి విచారణ, ఫీల్డ్​ ఎంక్వైరీ చేయకుండానే లీడర్ల పేర్ల మీద పట్టాలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే పట్టా చేయించుకున్న ఈ భూములను ఎలాగైనా అమ్మి క్యాష్​ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు సదరు లీడర్లు రియల్​ ఎస్టేట్​ వెంచర్లుగా మార్చేస్తున్నారు. ఈ క్రమంలో  వారు చేసిన భూ అక్రమాల వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

293 సర్వే నంబర్​లోని  భూమి ప్రభుత్వానిదే..

అచ్చంపేటలో 293 సర్వే నంబర్​లో 4.32 ఎకరాలు భూమి ఉంది. ఇది ప్రభుత్వ భూమి. 1955 ఖాస్ర, పహాని ప్రకారం ఈ భూమి ప్రభుత్వ భూమిగా రికార్డులలో ఉంది . ఈ భూమిని అమ్మడం చట్ట విరుద్ధం. ఆ భూమిలో జరుగుతున్న చదును పనులను నిలిపివేసి విచారణ జరుపుతాం. - మాధవి, ఆర్డీఓ, అచ్చంపేట