షిరిడీ: సాయిబాబా భక్తులకు శుభవార్త. ఎప్పుడెప్పుడు షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుందామా అని ఎదురు చూస్తున్న భక్తులకు దేవస్థానం ట్రస్ట్ తీపి కబురు చెప్పింది. దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్న అక్టోబర్ 7వ తేదీ నుంచి షిరిడీ సాయి దర్శనాలకు అనుమతించనున్నారు. ఈ మేరకు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది. కరోనా మార్గదర్శకాల ప్రకారం షిరిడీ వచ్చి సాయిబాబా స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలియజేసింది. కరోనా కారణంగా గత ఏడాది మార్చి 17న మూతపడి నవంబర్ 16న తెరచుకున్న షిరిడీ సాయి దేవాలయం.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన మరోసారి మూతపడి.. ఎల్లుండి అక్టోబర్ 7న దుర్గా నవరాత్రుల ప్రారంభం రోజున తెరచుకుంటోంది. కరోనా అదుపులో ఉండడం.. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపధ్యంలో షిరిడీ ఆలయం తెరచి భక్తుల దర్శనాలకు అనుమతివ్వాలని నిర్ణయించారు.
ప్రతిరోజు 15 వేల మందికి దర్శనాలకు అనుమతి
భక్తుల రద్దీని నివారించేందుకు ప్రతిరోజు 15 వేల మందికి మాత్రమే దర్శనాలకు అనుమతించనున్నారు. ఆన్ లైన్ ద్వారా 5 వేలు, ఆఫ్ లైన్ ద్వారా 5 వేలు, మరో 5 వేలు పెయిడ్ పాసులు జారీ చేయనున్నట్లు షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ వివరించింది. గంటకు 1150 మంది చొప్పున దర్శనాలు చేసుకునే అవకాశం ఉందని ట్రస్ట్ తెలియజేసింది. షిరిడీ వచ్చే భక్తులు విధిగా పాటించాల్సిన నిబంధనలు.
కోవిడ్ నిబంధనల మేరకు మాస్కు తప్పనిసరి.
హారతి సేవకు 90 మందికి మాత్రమే అనుమతి.
గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారికి అనుమతి లేదు.
