- చర్చికి వెళ్తున్నారని.. గోడపై శిలువ ఉందని ఎస్సీ సర్టిఫికెట్ రద్దు కుదరదు
- మద్రాస్ హైకోర్టు తీర్పు
చెన్నై: ఫలానా వ్యక్తి చర్చికి పోతున్నాడని.. లేదా అతని ఇంట్లో గోడపై శిలువ కనిపించిందని.. సదరు వ్యక్తి షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికెట్ ను రద్దు చేయడం కుదరదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తాను పుట్టిన మతాన్ని వదిలేశాడని చెప్పడానికి చర్చికి వెళ్లడం.. ఇంట్లో లేదా గోడపై శిలువ కనిపించడం వంటివి ఆధారంగా చూపించడం సరిపోదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. హిందూ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ క్రిస్టియన్ ను పెళ్లి చేసుకున్న కేసులో కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
హిందూ పల్లన్ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ క్రిస్టియన్‌ను పెళ్ళి చేసుకున్నారు. పిల్లలు కూడా కలిగారు. ఆమె పిల్లలు కూడా క్రిస్టియానిటీ తీసుకున్నారని చెప్పి ఆమెకు ఇచ్చిన పల్లన్ కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. అధికారుల నిర్ణయాన్ని ఆమె సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా అధికారులు తాము పిటీషనర్ ఇంటికి వెళ్లామని.. చర్చికి వెళ్తున్నట్లు వారి ఇంటి గోడపై శిలువ కూడా ఉందని కోర్టుకు తెలిపారు. అధికారుల వాదనతో కోర్టు సంతృప్తి చెందలేదు. ఒకవేళ క్రిస్టియన్ భర్త, పిల్లలతో పిటీషనర్ చర్చికి వెళ్ళినా... ఆమె తన వ్యక్తిగత మత విశ్వాసాన్ని ఒదిలేసిందని చెప్పలేమని హైకోర్టు తోసిపుచ్చింది. మరీ ఇంత సంకుచితంగా అధికారులు నిర్ణయం తీసుకోరాదని.. విశాల దృక్పథంతో ఆలోచించాలని కోర్టు అక్షింతలు వేసింది. పిటీషనర్ క్యాస్ట్ సరిఫ్టికెట్‌ను రద్దు చేస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. వెంటనే ఆమెకు పాత క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ జస్టిస్ సంజీబ్ బెనర్జి, జస్టిస్ ఎం దొరైస్వామిలతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది.
