అమిత్ షాపై చర్యలు తీసుకోండి

  • స్పీకర్ ఓంబిర్లాకు ఎంపీ వంశీకృష్ణ లేఖ
  • పార్లమెంట్ ఆవరణలో రాహుల్​తో కలిసి నిరసన  

న్యూఢిల్లీ, వెలుగు: అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ ఓంబిర్లాకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం లేఖ రాశారు. ‘‘అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దళితుల మనోభావాలను దెబ్బతీయడమే. రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడమే. దళితులు, అణగారిన వర్గాలకు అంబేద్కర్ పై ఉన్న అపారమైన గౌరవాన్ని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నది” అని అందులో పేర్కొన్నారు. 

పార్లమెంట్​లో ఆందోళన.. 

అంబేద్కర్ ఆశయాల పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడతామని వంశీకృష్ణ తెలిపారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. గురువారం ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశంలో వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కామెంట్స్ సహా పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యహాలపై చర్చించారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ముందు చేపట్టిన నిరసనలో రాహుల్, ప్రియాంక, తెలంగాణ ఎంపీలతో కలిసి వంశీకృష్ణ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అంబేద్కర్ కేవలం రాజ్యాంగ శిల్పి మాత్రమే కాదు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసిన మహానేత. అలాంటి మహానేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే, మన దేశ ప్రజాస్వామ్య భావాలను అవమానించడమే. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో మేం న్యాయ పోరాటం చేస్తున్నం. అమిత్ షా వెంటనే యావత్ దేశానికి క్షమాపణలు చెప్పి, మంత్రి పదవికి రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ప్రతిష్టను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు.