నిమజ్జనానికి అంతా రెడీ

  • చెరువులు, కుంటలను పరిశీలించిన అధికారులు
  • క్రేన్లు, ఫ్లడ్‌ లైట్లు, బారికేడ్ల ఏర్పాటు
  • అందుబాటులో ఫైర్​ఇంజన్లు,   గజ ఈతగాళ్లు

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: గణేశ్​నిమజ్జనానికి అంతా రెడీ అయింది. చెరువులు, కుంటలు, కాల్వల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం  8,825 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి పట్టణాలతో పాటు ఆయా జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, ఇతర ప్రధాన పట్టణాల్లో పెద్ద సైజు విగ్రహాల్ని ప్రతిష్ఠించడంతో వాటి నిమజ్జనం కోసం చెరువుల వద్ద  క్రేన్లు, బారికేడ్లు, లైటింగ్ ఏర్పాట్లు చేశారు.

 ఫైర్ ఇంజన్లను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. మున్సిపల్ అధికారులు డ్రా నిర్వహించి  సీరియల్ నంబర్ ప్రకారం విగ్రహాలను నిమజ్జనానికి తరలించేలా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్​మెంట్ అన్ని విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేసింది. దీనివల్ల ఏ విగ్రహం ఏ రూట్​లో ఉందనేది ఈజీగా తెలుస్తుంది. సిద్దిపేటలో కమిషనర్ అనురాధ, మెదక్ లో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డిలో ఎస్పీ రూపేశ్​, మున్సిపల్, రెవెన్యూ తదితర డిపార్ట్ మెంట్ అధికారులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. 

మెదక్ జిల్లాలో..

జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,975 విగ్రహాలను ప్రతిష్ఠించారు. కొన్ని చోట్ల పిల్లలు ప్రతిష్ఠించిన బాల వినాయకుల నిమజ్జనం ఐదు, ఏడు రోజులకు పూర్తి కాగా, మరికొన్ని చోట్ల 9 రోజులకు నిమజ్జనం చేయనున్నారు. కాగా మెజారిటీ విగ్రహాల నిమజ్జనం 11 రోజులకు జరుగనుంది. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పోలీస్ డిపార్ట్​మెంట్​జియో ట్యాగింగ్ పూర్తి చేసింది. ఎస్పీ స్వయంగా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. 

సిద్దిపేట జిల్లాలో.. 

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 2,989 వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆదివారం నుంచే జిల్లాలో నిమజ్జానాలు షురూ అవుతున్నాయి. 15న 443 విగ్రహాలు, 16న 427 విగ్రహాలు, 17న 1,967 విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,860 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. కొన్నిచోట్ల తొమ్మిది రోజులు, మరికొన్ని చోట్ల 12 రోజులకు నిమజ్జనం చేయనున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బాల వినాయకుల నిమజ్జనం పూర్తికాగా, ఆదివారం పటాన్ చెరు, అమీన్​పూర్​, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ ప్రాంతాల్లో నిమజ్జనం చేయనున్నారు. మరి కొన్ని చోట్ల 12 రోజులకు అంటే వచ్చే బుధవారం నిమజ్జనానికి నిర్వాహకులు ప్లాన్​చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు, మున్సిపల్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.  

పటిష్ట బందోబస్తు 

జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జన కార్యక్రమానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం. వినాయక విగ్రహాలన్నింటికీ  జియో ట్యాగింగ్ పూర్తిచేశాం. దీనివల్ల కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పర్యవేక్షించడానికి సులువుగా ఉంటుంది.  నిమజ్జన కార్యక్రమంలో ఎక్కడైనా వాహనం ఆగిపోతే  వెంటనే ఆ ప్రదేశాన్ని గుర్తించి సిబ్బందిని అక్కడికి పంపించడానికి వీలుంటుంది.   – అనురాధ, పోలీస్ కమిషనర్, సిద్దిపేట


భారీ సౌండ్స్​ వచ్చే డీజేలు వద్దు 

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నిమజ్జనోత్సవంలో  తక్కువ డెసిబుల్స్ స్పీకర్లను మాత్రమే వినియోగించాలి. అధిక శబ్దాలు వచ్చే డీజేలు ఉపయోగిస్తే కేసులు నమోదు చేస్తాం. అలాగే వినాయక నిమజ్జనంలో లేజర్ షో, లేజర్ లైటింగ్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఉత్సవ నిర్వాహకులందరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.  – ఉదయ్ కుమార్ రెడ్డి, మెదక్ ఎస్పీ