- ఫెడ్ చైర్మన్ కామెంట్స్‌తో సోమవారం భారీగా పడిన ఇండెక్స్‌లు
- 861 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: ఊహించినట్టుగానే ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ‘జాక్సన్ హోల్’ స్పీచ్ ప్రభావం సోమవారం దేశ మార్కెట్‌లపై పడింది. ఇన్‌ఫ్లేషన్‌ను కంట్రోల్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని, ఈ ప్రాసెస్‌లో ఎకానమీకి కొంత నష్టం తప్పదని పావెల్ శుక్రవారం (ఈ నెల 26) ప్రకటించారు. దీంతో యూఎస్‌లో వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయనే అంచనాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లతో పాటే దేశ స్టాక్ మార్కెట్‌లు కూడా నష్టపోయాయి. 1,200 పాయింట్ల నష్టంతో ఓపెన్ అయిన సెన్సెక్స్ చివరికి 861 పాయింట్ల (1.46 శాతం) నష్టంతో 57,973 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 246 పాయింట్లు తగ్గి 17,313 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు సోమవారం రూ. 2.39 లక్షల కోట్లు నష్టపోయారు. ఫెడ్ చైర్మన్ కామెంట్స్‌తో డాలర్ వాల్యూ, యూఎస్ బాండ్ ఈల్డ్‌లు పెరుగుతున్నాయి. ఫలితంగా దేశ ఈక్విటీ మార్కెట్‌లు సోమవారం పతనమయ్యాయి. వీటికి తోడు తైవాన్ జలసంధి గుండా యూఎస్ యుద్ధ నౌకలు వెళ్లడం కూడా గ్లోబల్‌గా జియో పొలిటికల్ టెన్షన్లను పెంచింది. సెక్టార్ల పరంగా చూస్తే, నిఫ్టీ ఐటీ, బ్యాంక్, మీడియా, మెటల్ ఇండెక్స్‌లు సోమవారం నష్టాల్లో ముగిశాయి.
మార్కెట్ పతనానికి కొన్ని కారణాలు..
1) ఫెడ్ కామెంట్..
వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందని మార్కెట్ అంచనా వేసిందని, కానీ, ఫెడ్ చైర్మన్ రేట్ల పెంపు ఎక్కువగా ఉంటుందనే సంకేతాలు ఇవ్వడంతో పాటు బిజినెస్‌లు, ప్రజలకు కొంత బాధ తప్పదని చెప్పడాన్ని మార్కెట్ అంచనా వేయలేదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. ఫలితంగా మార్కెట్‌లు పడుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఫెడ్ ‘తప్పక వడ్డీ రేట్లు పెంచడం నుంచి కావాలని వడ్డీ రేట్లు పెంచడం’ అనే స్టేజ్‌కి మారిందని బ్రోకరేజి కంపెనీ నోమురా పేర్కొంది. ఇన్‌ఫ్లేషన్ మరింత పెరగకుండా ఉండేందుకు మరికొంత కాలం పాటు ఫెడ్ వడ్డీ రేట్లను హయ్యర్ లెవెల్‌లోనే కొనసాగించాలని చూస్తోందని అభిప్రాయపడింది.
రూపాయి పతనం..
డాలర్ –రూపాయి విలువ సోమవారం 31 పైసలు తగ్గి 80.15 దగ్గర ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకింది. చివరికి కొంత బలపడి 10 పైసల నష్టంతో 79.96 వద్ద సెటిలయ్యింది. పావెల్ కామెంట్స్ తర్వాత డాలర్ వాల్యూ పెరిగిందని, ఫలితంగా ఆసియాలోని ఇతర కరెన్సీలతో పాటే మన కరెన్సీ వాల్యూ కూడా తగ్గిందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఆరు మేజర్ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ కదలికలను కొలిచే డాలర్ ఇండెక్స్ సోమవారం 0.47 % పెరిగి 109.31 లెవెల్‌కు చేరుకుంది. డాలర్ వాల్యూ పెరుగుతుండడం, గరిష్ట స్థాయిల్లో యూఎస్ బాండ్ ఈల్డ్‌లు ఉండడం, గ్లోబల్‌గా ఈక్విటీ మార్కెట్‌లు బలహీనంగా ఉండడంతో ఎమెర్జింగ్ మార్కెట్‌లలోకి విదేశీ ఇన్వెస్టర్లు డబ్బులు పెట్టడం ఛాలెంజ్‌తో కూడుకున్నదని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (కరెన్సీ డెరివేటివ్స్) అనింద్య బెనర్జీ పేర్కొన్నారు. ‘రూపాయి విలువ మరింత తగ్గకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటోంది. డాలర్–రూపాయి వోలటాలిటీ పెరగకూడదని అనుకుంటోంది. దీని బట్టి డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత కనిష్టాలకు తగ్గకుండా ఉండేందుకు డాలర్లను ఆర్‌బీఐ అమ్మొచ్చు. కానీ, రూపాయి పతనాన్ని ఇది ఆపకపోవచ్చు. వచ్చే 1–2 వారాల్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 79.90–80.50 మధ్య కదలాడుతుందని అంచనావేస్తున్నాం’ అని అన్నారు.
