ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో .. కబ్జా కోరల్లో ఎండోమెంట్‌‌‌‌‌‌‌‌ భూములు

  •  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆక్రమణల పర్వం 
  • 423 ఆలయాలకు 3,635 ఎకరాలుండగా.. 1500 ఎకరాలకుపైగా ఆక్రమణ
  •  మిగతా భూములకూ కబ్జాల ముప్పు
  •  పట్టించుకోని ఎండోమెంట్‌‌‌‌‌‌‌‌ అధికారులు

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దేవాదాయ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఆలయాలకు చెందిన సగం భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 423 ఆలయాలకు సంబంధించి 3,635 ఎకరాల భూములు ఉండగా.. ఇందులో 818 ఎకరాలు కబ్జాకు గురైనట్లు దేవాదాయ శాఖ అధికారికంగా తేల్చింది. 

కానీ లెక్క తేలని కబ్జా భూమి 1500 ఎకరాలకుపైగానే ఉంటుందని తెలుస్తోంది. ఆలయ భూముల రక్షణపై పట్టింపులేకపోవడం వల్లే ఆ భూములకు ఆనుకుని ఉన్న కొందరు హద్దులు చెరిపేసి ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాదాయ భూముల రక్షణకు కంచెలు ఏర్పాటు చేస్తామని ప్రకటనలకే పరిమితం కావడంతోనే కబ్జాలు ఆగడం లేదనే విమర్శలు ఉన్నాయి. 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కబ్జాలు..

దేవాదాయ శాఖ అధికారిక లెక్కల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాలో 111 ఆలయాలకు 1,131.09 ఎకరాలుండగా.. అత్యధికంగా 551.36 ఎకరాలు కబ్జాకు గురైంది. కరీంనగర్ జిల్లాలో 101 ఆలయాలకు 713 ఎకరాల భూములు ఉండగా 144 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది.  జగిత్యాల జిల్లాలో 118 ఆలయాలకు 1,174 ఎకరాల భూములు ఉండగా.. దీనిలో 87 ఎకరాలు కబ్జాకు గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 93 ఆలయాలకు 617 ఎకరాలు ఉండగా.. 35 ఎకరాలు ఆక్రమణకు గురైంది.

మచ్చుకు కబ్జాలు కొన్ని.. 

  • పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా ఆలయ భూములు కబ్జాకు గురయ్యాయి. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామంలోని రంగనాయకుల స్వామి ఆలయానికి చెందిన సుమారు 400 ఎకరాలు కబ్జాకు గురైంది. మూడు, నాలుగు దశాబ్దాల కింద దేవుని మాన్యం భూములను కౌలుకు, లీజుకు తీసుకున్న కొందరు వ్యక్తులు వీటిని అక్రమంగా పట్టాలు చేయించుకున్నారు. 
  • పెద్దపల్లి గోశాలకు చెందిన 1.13 ఎకరాలు, పెద్దపల్లి సీతారామస్వామి ఆలయానికి చెందిన 8.32 ఎకరాలు, పెద్దపల్లి నరసింహస్వామి ఆలయానికి చెందిన 13.20 ఎకరాలు కబ్జా అయ్యాయి. 
  • జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న టెంపుల్ కు చెందిన 2 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. జగిత్యాలలోని రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన 2.04 ఎకరాలు, ఇదే జిల్లాలోని కోరుట్ల వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన 20 గుంటలు, జగిత్యాల రామ మందిర భూమి 19 గుంటలు కబ్జా కోరల్లో చిక్కింది. 
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లోని గవర్నమెంట్ కాలేజీ సమీపంలో హనుమాన్ ఆలయానికి 2504 సర్వే నంబర్ 1.14  ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఈ భూమిలో స్థానికులు ఇండ్లు నిర్మించుకున్నారు.  తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం నుస్తులాపూర్‌‌‌‌‌‌‌‌లో రాజీవ్‌‌‌‌‌‌‌‌రహదారి పక్కనే 175, 176 సర్వే నంబర్లతోపాటు మరో రెండు సర్వే నంబర్లలో అనంత పద్మనాభ స్వామి ఆలయ భూమి 10.10 ఎకరాలు ఉంది. ఈ భూమిని కొందరు ఆక్రమించగా.. స్థానికులు కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు. 
  • సిరిసిల్లలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1.15 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది.