బలహీనవర్గాల ధైర్యం.. జేబీ రాజు : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

  • ఆయన నుంచి నేటి తరం చాలా నేర్చుకోవాలి: ఎమ్మెల్యే వివేక్​
  • ఘనంగా దళిత ఉద్యమనాయకుడు జేబీ రాజు 85వ పుట్టినరోజు 

బషీర్ బాగ్, వెలుగు: ఎక్కడైనా బలహీనవర్గాలకు అన్యాయం జరిగితే అక్కడ వారికి అండగా దళిత ఉద్యమ నాయకుడు జేబీ రాజు ఉంటారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. ‘‘జేబీ రాజు.. గొప్ప కమిట్​మెంట్ ఉన్న వ్యక్తి. ఆయనది ప్రజల కోసం పనిచేసే తత్వం” అని కొనియాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ.. శృతిలయ ఫౌండేషన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఆర్గనైజేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో దళిత ఉద్యమ నాయకుడు డా. జేబీ రాజు 85వ పుట్టిన రోజు వేడుకలు గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి గీతారెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్​పర్సన్ వెన్నెల తదితరులు పాల్గొన్నారు. 

జేబీ రాజును వివేక్ వెంకటస్వామి, గీతారెడ్డి గజమాలతో సన్మానించి.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. పాలకులు తప్పు చేస్తే భయపడకుండా నిలదీసే మనస్తత్వం జేబీ రాజుదని, బలహీనవర్గాలకు ఆయన ధైర్యం అని ప్రశంసించారు. ‘‘ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం చేస్తూ , ప్రజా సమస్యలపై జేబీ రాజు పోరాటాలు చేశారు. కారంచేడు, చండూరు ఘటనలతో దళితులకు అన్యాయం జరిగితే, మా నాన్న వెంకటస్వామితో కలిసి ఉద్యమించారు. 

అంతర్జాతీయ వేదికపై సామాజిక స్థితిగతుల అంశంపై ఏకధాటిగా 14 గంటల పాటు స్పీచ్ ఇచ్చిన రికార్డు ఆయన సొంతం. జేబీ రాజు నుంచి నేటి తరం చాలా నేర్చుకోవాలి. ఆయన జీవితంపై పుస్తకం వస్తే భవిష్యత్తు తరాలకు ఎంతో దోహదపడుతుంది” అని వివేక్​ వెంకటస్వామి అన్నారు.  శృతిలయ వ్యవస్థాపక కార్యదర్శి ఆమని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.