గత పదేళ్లలో చేయలేని పనుల్ని తాము వంద రోజుల్లో పూర్తి చేస్తామంటున్నారు 'మక్కల్ నీది మయ్యం'(MNM) అధినేత కమల్ హాసన్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేస్తున్న కోయంబత్తూర్ నియోజకవర్గంలో ప్రసంగించిన ఆయన.. ఈ నగరాన్ని ఆదర్శ నగరంగా మార్చేస్తామని హమీ ఇచ్చారు. రోడ్‌షో ద్వారా ప్రధాన మార్గాలు, చిన్న చిన్న వీధుల్లో కూడా దూసుకెళ్తూ ప్రచారాన్ని సాగించారు. ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ తాము ప్రకటించిన మేనిఫెస్టోను వివరిస్తూ ముందుకుసాగారు. పదేళ్లల్లో గత ప్రభుత్వాలు చేయలేని పనుల్ని 100రోజుల్లో చేసి చూపిస్తానని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రం రూపురేఖల్ని మార్చేస్తామని, అందుకు ప్రజల మద్దతు ఉంటే చాలని అన్నారు.
మరోవైపు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన సవాల్‌పై కమల్ స్పందించారు కమల్. తన ప్రత్యర్థి, బీజేపీ నేత వానతీ శ్రీనివాసన్ ఓ డమ్మీ అంటూ, ఈ విషయంగా ప్రధాని మోడీతో చర్చించేందుకు కూడా సిద్ధమంటూ ఘాటు సమాధానమిచ్చారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీనటి, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె సుహాసిని సుడిగాలి పర్యటన చేశారు. నిజాయితీకి ఓటు వేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కమల్ హాసన్.
