చట్ట వ్యతిరేకచర్యలకు పాల్పడితే శిక్షలు :  లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వి.రజని

వనపర్తి, వెలుగు: పౌరులు సమాజంలో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వి.రజని అన్నారు. గురువారం స్థానిక వాగ్దేవి జూనియర్ కాలేజీలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైనర్ పిల్లలు వాహనాలను నడపరాదని, బాల్యవివాహాలు చేయరాదని వివరించారు.

చట్టాన్ని అతిక్రమిస్తే సమాజంలో అనర్ధాలు చోటు చేసుకుంటాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు చట్టాలపై అవగాహన  పెంచుకొని, సన్మార్గంలో నడవాలని సూచించారు. లోక్ అదాలత్ లో ఉచిత న్యాయ సేవలున్నాయని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సఖి లీగల్ కౌన్సిల్ డేగల కృష్ణయ్య, కాలేజీ ప్రిన్సిపాల్ విజయ్​కుమార్, లాయర్లు నరేందర్ బాబు, భరణి, లోకదాలత్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.