- కార్యనిర్వాహక అధికారాల ఫైల్‌పై సంతకం చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ: కార్యనిర్వాహక అధికారాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా నివాసం ఎదుట ఆప్ మంత్రులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేశారు. 90 నిమిషాల పాటు ఎల్జీ నివాసం ఎదుట బైఠాయించారు. దీంతో ఎల్జీ వారిని లోపలికి పిలిపించుకుని, వారితో సమావేశమయ్యారు. అంతకుముందు సర్వీసెస్ సెక్రటరీ ఆశిశ్ మోరె బదిలీకి సంబంధించిన ఫైల్ ను క్లియర్ చేయాలని ఢిల్లీ సర్వీసెస్ మినిస్టర్ సౌరభ్ భరద్వాజ్ ఎల్జీకి లేఖర్ రాశారు. ఆ ఫైల్ ఇంకా క్లియర్ కాకపోవడంతో పరిపాలనకు సంబంధించిన మార్పులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే ఆ ఫైల్‌ను పంపామని ఆయన తెలిపారు. ఈ ఫైల్‌ను ఎల్జీ క్లియర్ చేయకపోవడంతో ఆప్ మంత్రులు ఆయన నివాసం ఎదుట బైఠాయించారు. కాగా, అధికారుల బదిలీ, పోస్టింగులకు సంబంధించి సర్వీసు వ్యవహారాల్లో ఆప్ ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు జారీ అయిన కొన్ని గంటల్లోనే సర్వీసెస్ సెక్రటరీ ఆశిశ్ మోరెను తొలగించారు. ఆయనను తొలగిస్తూ జారీచేసిన ఫైల్‌ను ఎల్జీ ఇంకా క్లియర్ చేయలేదు.
మంత్రి సౌరభ్ నన్ను బెదిరించారు
ఢిల్లీ సర్వీసెస్ సెక్రటరీ పదవి నుంచి తప్పించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆశిశ్ మోరే.. ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌పై చీఫ్ సెక్రటరీ, ఎల్జీకి ఫిర్యాదు చేశారు. మే 16న మంత్రి తనను పిలిపించి బెదిరించారని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, తనకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లపై ఎల్జీకి కాకుండా ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సర్వీసెస్ సెక్రటరీ పదవి నుంచి ఆశిశ్ మోరేను తొలగించారు. కాగా, మోరే ఆరోపణను మంత్రి సౌరభ్ భరద్వాజ్ తోసిపుచ్చారు. తాను శారీరకంగా దాడి చేశానని ఆరోపించినా.. తాము ఏమి చేయలేమన్నారు. ఇందులో లెఫ్టినెంట్ గవర్నర్ కుట్ర కూడా ఉందని భరద్వాజ్ ఆరోపించారు.
