పుణెలో మొదటి పోలీసు డాగ్ ట్రైనర్ దీప్తి

పుణెలో మొదటి పోలీసు డాగ్ ట్రైనర్ దీప్తి

తలచుకుంటే సాధించలేనిది ఏమి లేదని నిరుపిస్తున్నారు మహిళలు. ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరుస్తూ.. తమ కంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఓ మహిళ పోలీస్ డాగ్ స్క్వాడ్‌ లో ఉద్యోగం సంపాదించుకోవడమే కాదు.. ఆ డాగ్స్ కు ట్రైనింగ్ ఇచ్చే విధి నిర్వహణలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. పుణెకు చెందిన దీప్తి అధవ్ రౌత్ మొదటి పోలీసు మహిళా కుక్కల నిర్వహణ అధికారిగా రికార్డ్ సృష్టించారు.

పూణెలోని పోలీసుల మొదటి మహిళా డాగ్స్ నిర్వహణ చేపట్టిన మొదటి మహిళ దీప్తి అధవ్ రౌత్. వృత్తి పట్ల మక్కువ, అంకితభావం ఉన్న వ్యక్తిగా పేరు పొందారు. మొదటిసారి డాగ్ స్క్వాడ్‌ కు ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేశారు. అయినా దీప్తి నిరాశకు గురికాలేదు.. తన లక్ష్యం మరువలేదు.. మళ్ళీ ప్రయత్నించారు. చివరకు తాను అనుకున్న ఉద్యోగాన్ని పొందారు. దీప్తికి పూణె పోలీసు డాగ్ స్క్వాడ్‌లో ఉద్యోగం లభించింది.

త్వరలో పదవీ విరమణ చేయనున్న దీప్తి.. కుక్కలతో కలిసి పని చేయడానికి ఇష్టపడుతారు. ఆమె మొదటిసారిగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు అందమైన నల్లని లాబ్రడార్ కుక్కను ఇచ్చారు, అప్పుడు దానికి ఆరేళ్ళ వయసు. అప్పుడు దీప్తి వీరుకు రెండవ హ్యాండ్లర్. మాదకద్రవ్యాల బృందంలో పనిచేసే వీరుని దీప్తి ఎంతో కేరింగ్ గా చూస్తుంది. దానితో రోజూ కసరత్తులు చేయిస్తుంది. మంచి ఆహారాన్ని అందిస్తుంది. తాను ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వీరుని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నా అని చెప్పారు. తనకు ఇప్పుడున్న లక్ష్యం ఒకటే నని కొత్త కుక్కకు మొదటి హ్యాండ్లర్ కావడమే నని తెలిపారు దీప్తి.