మెదక్​ జిల్లాలో రూ.130 కోట్ల బియ్యం పక్కదారి 

  • మెదక్​ జిల్లాలో సీఎంఆర్​ ఇవ్వని మిల్లర్లపై క్రిమినల్ ​కేసులు
  • ఆర్ఆర్​యాక్ట్​ కింద  రికవరీకి చర్యలు
  • స్థిర, చరాస్థుల వేలానికి రెడీ 
  • నర్సాపూర్​లో రూ. 57 కోట్లు   బకాయి పడ్డ ఓ వ్యాపారి  

మెదక్, వెలుగు: జిల్లాలో రూ.130 కోట్ల విలువైన కస్టం మిల్లింగ్ ​రైస్​(సీఎంఆర్​) పక్కదారి పట్టాయి. ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా మోసం చేసిన రైస్​ మిల్లర్లపై క్రిమినల్​ కేసులు నమోదు చేసి బకాయి మొత్తం రికవరీ చేసేందుకు సివిల్​సప్లయీస్​అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో160 రైస్​మిల్లులున్నాయి. ప్రతిఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో పీఏసీఎస్, ఐకేపీ, ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని కస్టం మిల్లింగ్​కోసం రైస్​మిల్లులకు కేటాయిస్తారు.

వారు ధాన్యాన్ని మిల్లింగ్​చేసి క్వింటాలుకు 67 కిలోల చొప్పున బియ్యాన్ని నిర్దేశిత గడువులోగా సివిల్​సప్లై డిపార్ట్​మెంట్​కు అందజేయాలి. కాగా, జిల్లాలో పలువురు మిల్లర్లు ఈ నిబంధన తుంగలో తొక్కారు. 2022–-23 వానాకాలం, 2022-–23 యాసంగి సీజన్లకు సంబంధించి ఏడుగురు రైస్​మిల్లర్లు సీఎంఆర్​కింద ఇవ్వాల్సిన 18 వేల మెట్రిక్​టన్నుల బియ్యాన్ని గడువు ముగిసినా ఇవ్వలేదు. గడువులోగా సీఎంఆర్ ఇవ్వకుంటే నిబంధనల ప్రకారం పెనాల్టీ  కింద 25 శాతం అదనంగా  ఇవ్వాలి. ఈ లెక్కన ఆయా మిల్లర్లు 22,500 మెట్రిక్​టన్నుల బియ్యం బకాయి పడ్డారు.

ఈ బియ్యం విలువ రూ.82 కోట్లు ఉంటుంది. సివిల్ సప్లయీస్​అధికారులు ఎన్నిసార్లు అడిగినా, హెచ్చరించినా స్పందన  లేకపోవడంతో రామాయంపేట మండలం కాట్రియాలలోని భవాని రైస్​మిల్, నర్సాపూర్​మండలం పెద్ద చింతకుంటలోని మహాలక్ష్మి, వీరభద్ర, పాపన్నపేట సాయికృప, హవేలి ఘనపూర్ మండలం వాడిలోని శారద ట్రేడర్స్, సర్దనలోని చాముండేశ్వరి, మెదక్ మండలం పాతూర్​లోని సాయి సంతోషి రైస్​మిల్స్​పై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు సివిల్​ సప్లయీస్​డీఎం హరికృష్ణ తెలిపారు.

ఇదిలా ఉండగా, నర్సాపూర్​లో శ్రీధర్​గుప్తాకు చెందిన మూడు రైస్​మిల్లుల మీద కూడా కేసులు నమోదు చేశారు. వాటి నుంచి సీఎంఆర్​కు సంబంధించిన బకాయిలు రూ.57.17 కోట్లు రావాల్సి ఉండగా రూ.14.70 కోట్లు రికవరీ చేశారు. ఇవిపోను ఇంకా రూ.42.47 కోట్లు బకాయి ఉంది. కాగా, శ్రీధర్​గుప్తాకు చెందిన రూ.15 కోట్ల విలువైన రైస్​మిల్​సివిల్​సప్లయీస్​డిపార్ట్​మెంట్​కంట్రోల్​లో ఉంది. అలాగే 2022-–23 సీజన్​కు సంబంధించి మరో 16 రైస్​మిల్లుల నుంచి 4,700 మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ రావాల్సి ఉండగా అందులో 2,500 మెట్రిక్​టన్నులు రికవరీ అయ్యింది. అదిపోను ఇంకా 2,200 మెట్రిక్​ టన్నులు పెండింగ్​ఉంది. ఈ బియ్యం విలువ రూ.7 కోట్ల వరకు ఉంటుంది.  

స్థిర, చరాస్థుల జప్తుకు చర్యలు

సీఎంఆర్​బకాయిలు ఇవ్వని మిల్లర్లపై ఆర్ఆర్​యాక్ట్​కింద స్థిర, చరాస్థుల జప్తు దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫామ్–​1, ఫామ్​–2 నోటీసులిచ్చినా స్పందించకుంటే స్థిరాస్థులైన ఇండ్లు, పొలాలు, ఇతర ఆస్థులు, చరాస్థులైన కార్లు, ఏసీలు, ఫ్రిడ్జ్​లు, టీవీల వంటివి ఏమున్నాయో గుర్తిస్తారు. నెల రోజుల సమయం ఇచ్చి అయినా స్పందించకుంటే వేలం వేస్తారు. 

నోటీసులు ఇస్తున్నాం

సివిల్​సప్లయీస్​ కమిషనర్​ఆదేశాల మేరకు సీఎంఆర్​బకాయి పడ్డ రైస్​మిల్లర్ల మీద క్రిమినల్​కేసులు నమోదు చేశాం. బియ్యం తాలూకు డబ్బులను రికవరీ చేసేందుకు ఆర్ఆర్​యాక్ట్ అమలు చేస్తున్నాం. సంబంధిత మిల్లర్లకు ఫామ్​– 1 నోటీసులు ఇచ్చాం. ఆ గడువు తీరిపోవడంతో ఫామ్–- 2 నోటీసులివ్వనున్నాం. మొత్తం ఐదు నోటీసులిస్తాం. అయినా స్పందన లేకపోతే గజిట్​నోటిఫికేషన్​ జారీ చేసి ఆస్తులు వేలం వేస్తాం.  

హరికృష్ణ, సవిల్​ సప్లై డీఎం