యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

  • ధర్మదర్శనానికి మూడు గంటలు.. స్పెషల్ దర్శనానికి గంట సమయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. సండే హాలిడే కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. 

రద్దీ కారణంగా నరసింహుడు ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. కొండ కిందా, పైనా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. లక్ష్మి పుష్కరిణి, కల్యాణకట్ట, బస్సు బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. 

ఆలయంలో నిర్వహించిన సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, స్వామివారి నిత్య కల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. 

భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.52,90,951 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.17,65,380, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6.50 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.9.45 లక్షల ఆదాయం సమకూరింది.