కానిస్టేబుల్ అత్యుత్సాహం.. గాయాలపాలైన ఓ కుటుంబం

 ఓ కానిస్టేబుల్ అత్యుత్సాహంతో ఓ కుటుంబం గాయాలపాలైంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... తాండూరు మండలం చెంగోలు గ్రామానికి చెందిన నర్సింలు కుటుంబ సభ్యులతో కలిసి యాలల మండలంలోని పగిడ్యాల్ గ్రామంలో  ఫంక్షన్ కు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో బాగైపల్లి గేట్ సమీపంలో యాలాల పోలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ లు.. నర్సింహులును ఆపి బైక్ తాళం లాక్కున్నారు. తన బైక్ తాళం ఇవ్వాలని కోరగా ఓ కానిస్టేబుల్ నర్సింలు బైక్ ను తోశాడు. దీంతో నరసింహులుతో పాటు  కుటుంబ సభ్యులు కూడా కింద పడిపోయారు. బైక్ పై ఉన్న చిన్నారికి కూడా గాయాలయ్యాయి.  

ఎందుకు తోశారని కానిస్టేబుల్ ను నరసింహులు ప్రశ్నించగా, కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీతో నరసింహులు తలపై కొట్టాడు. దీంతో నరసింహులు తలకు తీవ్ర గాయం అయింది. రక్తపు మడుగులతో  నర్సింలు తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. యాలాల కానిస్టేబుల్  అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, ఎంత చెప్పినా వినకుండా  దౌర్జన్యంగా తనపై దాడి చేశారని నర్సింలు వాపోయాడు. బూతులు తిడుతూ  విచక్షణ రహితంగా దాడి చేసిన కానిస్టేబుల్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని నరసింహులు, కుటుంబ సభ్యులు తెలిపారు.