మన్మోహన్ సేవలు మరువలేనివి : సీఎం రేవంత్​రెడ్డి

  • ఆయన మృతి దేశానికి  తీరని లోటు: సీఎం రేవంత్​రెడ్డి
  • మాజీ ప్రధాని పార్థివదేహానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి
  • మంత్రులు దామోదర, పొన్నం, జూపల్లి, పీసీసీ చీఫ్ మహేశ్ కూడా..

న్యూఢిల్లీ/ హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.‌‌‌‌ ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. శుక్రవారం కర్నాటక రాష్ట్రం బెళగావిలో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ అనంతరం ప్రత్యేక విమానంలో ఆయన నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. 

సీఎం వెంట హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుకూ, పీసీసీ రాష్ట్ర చీఫ్ మహేశ్ గౌడ్, ఏఐసీసీ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షి, సీడబ్ల్యూసీ సభ్యులు మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.

మోతిలాల్ మార్గ్ లోని 3 వ నంబర్ బంగ్లాలో ఉంచిన మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి.. మహేశ్​గౌడ్, దామోదర రాజనర్సింహ, ఎంపీలతో‌‌‌‌ కలిసి రేవంత్​రెడ్డి నివాళి అర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్, కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారికి తన సానుభూతిని తెలిపారు. దేశానికి మన్మోహన్ చేసిన అపారమైన సేవలను స్మరిస్తూ.. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి సంతాపం తెలిపారు. నివాళి అర్పించిన తర్వాత మంత్రి జూప‌‌‌‌ల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. దేశం మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని.. ద‌‌‌‌శాబ్ద పాలనలో విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చారని పేర్కొన్నారు. 

అలాగే మన్మోహన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురైన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పలువురు గాంధీ భవన్ లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ లు మెట్టు సాయి, శోభారాణి, పీసీసీ నేతలు కమార్ రావు, చరణ్ కౌశిక్, బొల్లు కిషన్, సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

మన్మోహన్ కు భారత రత్న ఇవ్వాలి: మల్లు రవి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​కు భారతరత్న ఇవ్వాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ మరణం దేశ ప్రజలకు తీరని లోటన్నారు‌‌‌‌. 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా సేవలందించారని.. కుదేలైన దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టారని చెప్పారు. మన్మోహన్ సింగ్ అంటేనే సంస్కరణలకు పెట్టింది పేరు అని కొనియాడారు.

మన్మోహన్ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతయ్: ఉత్తమ్

కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి మన్మోహన్ సింగ్ ఎనలేని సేవలు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. ‘‘నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్డీయే వైఖరికి నిరసనగా పార్లమెంట్ ఆవరణలో మన్మోహన్ సింగ్​తో కలిసి నిరసనలో పాల్గొన్నాను. ఆ సందర్భం నాకు ఇప్పటికీ గుర్తున్నది. మన్మోహన్ సింగ్ భౌతికంగా మన నుంచి దూరమైనప్పటికీ.. ఆయన ఆలోచనలు, దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’’అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.