జీఎస్‌‌డీపీ వృద్ధిలో తెలంగాణ టాప్ .. 18,700 కోట్ల డాలర్లకు చేరే చాన్స్

  • ఈ ఆర్థిక సంవత్సరంలో 18,700 కోట్ల డాలర్లకు చేరే చాన్స్​
  • 2030 నాటికి రెట్టింపు..  సీఐఐ రిపోర్ట్‌‌‌‌లో వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తున్నదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) రిపోర్ట్ పేర్కొంది. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి (జీఎస్‌‌‌‌డీపీ) వృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ టాప్‌‌‌‌లో ఉన్నట్టు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్‌‌‌‌డీపీ 18,700 కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని.. 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని వెల్లడించింది. బ్రిడ్జింగ్ గ్యాప్:  తెలంగాణ విద్యావ్యవస్థలో నైపుణ్యాలు పెంచడం’పేరుతో ఈవై-పార్థినన్ అనే సంస్థతో కలిసి సీఐఐ తెలంగాణ ఓ రిపోర్టును విడుదల చేసింది. 

అందులో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. ఓ రకంగా దేశానికి లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలంగాణ.. ఇతర రాష్ట్రాలకు మార్గం చూపిస్తుందని తెలిపింది. ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పునరుత్పాదక విద్యుత్, ఎలక్ట్రిక్ వెహికల్స్, రక్షణ రంగంపై దృష్టి సారించిందని తెలిపింది. 

2030 నాటికి 16 లక్షల ఉద్యోగాలు..

రాష్ట్రంలో 2030 నాటికి 16 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని సీఐఐ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. అయితే, అందుకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. సిలబస్‌‌‌‌‌‌‌‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుండాలని, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్​), యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల ద్వారా ఇండస్ట్రీ డిమాండ్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా నైపుణ్యాలు పెంచాలని సూచించింది. మరోవైపు, పట్టణాల్లో నిరుద్యోగం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. 

చాలా మంది గ్రాడ్యుయేట్లు నైపుణ్యం లేని కారణంగా అతి తక్కువ జీతంతో ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారని తెలిపింది. ఆ గ్యాప్‌‌‌‌‌‌‌‌ను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిందని కొనియాడింది. స్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నదని పేర్కొంది. 

ఆరో తరగతి నుంచే ఓకేషనల్ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేస్తున్నదని, 30 శాతం సిలబస్‌‌‌‌‌‌‌‌లో నైపుణ్యాలు పెంచే సబ్జెక్టులను చేరుస్తున్నదని తెలిపింది. నైపుణ్యాలు పెంచేలా విద్యాసంస్థలను వివిధ పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నదని, తద్వారా ఇంటర్న్ షిప్స్, అప్రెంటిస్ షిప్‌‌‌‌‌‌‌‌లను పెంచేందుకు కార్యాచరణ రూపొందించిందని తెలిపింది. మరోవైపు, ఓకేషనల్ ట్రైనింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చిన జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలపై స్టడీ చేయనుందని పేర్కొంది.