- భారీగా తరలివచ్చిన జనం
- సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్‌కు చప్పట్లు
- సీఎం అండతో
- ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
యాదాద్రి/ నల్గొండ/ మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ సక్సెస్ అయ్యింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించారు. సభ విజయవంతం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండకు వరాలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్‌లో నూతనోత్సహం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ఈనెల 3 నుంచి 'ప్రజాపాలన విజయోత్సవం' వేడుకలు ప్రారంభించారు.
ఇందులో భాగంగా శనివారం నల్గొండలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొన్నారు. బ్రాహ్మణ వెల్లెంలలోని ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌పవర్ ప్లాంట్‌లో యూనిట్–2ను సీఎం ప్రారంభించారు. అనంతరం నల్గొండ పట్టణంలో విజయోత్సవ సభ నిర్వహించారు.
Also Read :- పండుగలా.. ప్రజాపాలన విజయోత్సవాలు
భారీ ఎత్తున జన సమీకరణ..
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నల్లగొండ జిల్లాలో తొలిసారిగా పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభను సక్సెస్ చేయడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతృత్వంలో భారీ ఎత్తున జనాన్ని సమీకరించారు. సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడినంత సేపు చప్పట్ల రూపంలో ప్రజల నుంచి రియాక్షన్ కన్పించింది.
ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండతో జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో మోటార్లు రిపేర్ చేయించడంతోపాటు సొరంగ మార్గం పనులు కూడా చేపడుతామన్నారు. రెండేండ్లలో పనులన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పారు. బ్రాహ్మణ వెల్లెంల ద్వారా లక్ష ఎకరాలకు నిరందిస్తామన్నారు. అప్పటి కాంగ్రెస్ సీఎం రాజశేఖర్ రెడ్డి ఎస్ఎల్బీసీకి శంకుస్థాపన చేస్తే.. ఇప్పటి సీఎం రేవంత్ పూర్తి చేయిస్తున్నారని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్పూర్తయిన తర్వాత జిల్లాలో ప్లోరైడ్ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావడంతోపాటు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ పదేండ్లుగా విధ్వంస పాలన చేసిన నిరంకుల పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పి, ప్రజాపాలనకు స్వాగతం పలికారని తెలిపారు.
గత ప్రభుత్వం నల్లగొండపై వివక్ష చూపిందని ఆరోపించారు. వచ్చే నాలుగేండ్లతోపాటు మరో రెండు టర్మ్‌లు రాష్ర్టంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
నల్గొండకు సీఎం వరాలు..
విజయోత్సవ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డెవలప్మెంట్ కోసం సీఎంను ఫండ్స్ కోరారు. దీంతో నల్గొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు గుప్పించారు. జిల్లాలోని 5 రోడ్ల విస్తరణ, పటిష్టత కోసం రూ.204 కోట్లను మంజూరు చేశారు. నల్గొండ టౌన్‌లోని లతీఫ్ సాహెబ్ గుట్ట వరకు ఘాట్ రోడ్‌తోపాటు బ్రహ్మంగారి మఠం శివాలయం రోడ్డు కోసం రూ.140 కోట్లు మంజూరు చేశారు.
దుప్పలపల్లి నుంచి ఖాజీరామారం విస్తరణ కోసం రూ.20 కోట్లు, సాగర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కనగల్ రోడ్డు కోసం రూ.14 కోట్లు, -చర్లపల్లి నామ్ రోడ్డు నుంచి పిట్లంపల్లి వరకు రూ.16 కోట్లతో రహదారి విస్తరణ, -నార్కట్‌పల్లి రోడ్డు విస్తరణకు రూ.14 కోట్లను సీఎం మంజూరు చేశారు. ఈ సందర్భంగా సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.