ఛత్తీస్ గఢ్ లో బోరుబావిలో పడిన బాలుడిని 104 గంటలు కష్టపడి బయటకు తీశారు ఆర్మీ సిబ్బంది. బోర్ వెల్ లో పడిన పదేళ్ల బాలుడు రాహుల్ సాహూ కోసం ఛత్తీస్ గఢ్ జాంజ్ గిరి చంపాలో నిర్వహించిన ఆపరేషన్ పూర్తి చేశారు ఆర్మీ అధికారులు. వెంటనే రాహుల్ సాహూను.. ప్రత్యేక అంబులెన్స్ లో బిలాస్ పూర్ లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ లో ఐసీయూలో రాహుల్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని.. ట్రీట్మెంట్ ఇస్తున్నామన్నారు డాక్టర్లు.
ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి దగ్గర ఆడుకుంటూ..వెళ్లి బోర్ వెల్ లో పడిపోయాడు రాహుల్. బాలుడి కోసం వెతుకుతుండగా.. అరుపులు విని బోర్ వెల్ లో పడినట్లు గుర్తించారు కుటుంబసభ్యులు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. మరోవైపు, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్.. బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడి.. బాలుడిని ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చారు.
